భారతీయ పెళ్లిళ్లలో భోజనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లికి వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేయడం కుటుంబాలు తమ గౌరవంగా భావిస్తాయి. అయితే ఈ ఆతిథ్య మర్యాదలు కొన్నిసార్లు అనవసరమైన గొడవలకు కారణమవుతున్నాయి. పెళ్లిలో ఎన్ని రకాల వంటకాలు పెట్టారు? తమకు నచ్చిన వంటకం ఉందా? ఇతరులకు ఎలాంటి మర్యాదలు చేశారు? అనే విషయాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లిబొక్క , పన్నీర్ కోసం కోసం పెళ్లిళ్లు రద్దు కావడం ఈ ధోరణిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
తెలంగాణలో జరిగిన ఈ ఘటనలో వధువు కుటుంబం పెళ్లి విందు కోసం మటన్‌తో పాటు వివిధ రకాల వంటకాలను సిద్ధం చేసింది. అయితే వరుడి కుటుంబం ఆశించిన నల్లిబొక్క (Mutton Bone Marrow) వడ్డించకపోవడంతో వివాదం మొదలైంది. మటన్ వంటకాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా నల్లిబొక్క ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ వరుడి తరఫు వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మొదట భోజన ఏర్పాట్లపై మొదలైన వాగ్వాదం చివరకు రెండు కుటుంబాల మధ్య గొడవగా మారింది. ఈ వివాదం కారణంగా పెళ్లి కూడా రద్దయింది.
ఈ ఘటన చాలామందికి ‘బలగం’ (Balagam) సినిమాలోని సన్నివేశాలను గుర్తుచేస్తోంది. సినిమాలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలు ఎలా పెద్ద సమస్యలుగా మారతాయో చూపించారు. కానీ నిజ జీవితంలో కూడా విందు భోజనంలోని ఒక వంటకం కోసం పెళ్లి సంబంధమే తెగిపోయే పరిస్థితి రావడం ఆందోళన కలిగిస్తోంది. అసలు వివాహం అంటే ఒక విందు కార్యక్రమమా? లేక ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే బంధమా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.
ఇదొక్కటే కాదు.. మరో పెళ్లిలో పనీర్ (Paneer) కారణంగా కూడా పెద్ద గొడవ జరిగింది. పెళ్లి భోజనంలో మటర్ పనీర్ (Matar Paneer)లో పనీర్ ముక్కలు తక్కువగా ఉన్నాయంటూ కొందరు అతిథులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు కొందరు కుర్చీలు విసురుకునే స్థాయికి గొడవ చేరుకుంది. అతిథులకు భోజనం పెట్టే విషయంలో చిన్న అసంతృప్తిని కూడా సహించలేని పరిస్థితి కనిపించింది.
ఇలాంటి ఘటనలను కేవలం వింత సంఘటనలుగా చూసి నవ్వుకోవడం కంటే వాటి వెనుక ఉన్న సామాజిక ధోరణిని కూడా గమనించాలి. పెళ్లిళ్లు కుటుంబాల ఆర్థిక స్థాయిని, హోదాను ప్రదర్శించే వేదికలుగా మారుతున్నాయనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. వధువు, వరుడి అభిరుచులు, భవిష్యత్తు కంటే విందు ఖర్చులు, అలంకరణలు, అతిథులకు చేసే మర్యాదలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆతిథ్యం అనేది ప్రేమతో చేయాల్సిన పని కానీ, ఎదుటివారిని అంచనా వేసే కొలమానం కాకూడదు.
ముఖ్యంగా ఒక వంటకం కోసం పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకునే స్థాయికి వెళ్లడం వెనుక పట్టుదల, పరస్పర అవగాహన లోపం వంటి అంశాలను కూడా పరిశీలించాలి. పెళ్లి అనేది ఒక్కరోజు జరిగే వేడుక కాదు.. జీవితాంతం కొనసాగాల్సిన బంధానికి ఆరంభం. విందులో ఏ వంటకం ఉందనే దానికంటే ఆ బంధంలో ఎంత గౌరవం, నమ్మకం, సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నాయనేదే ముఖ్యం. లేదంటే పెళ్లిళ్లు జ్ఞాపకాలుగా మిగలాల్సిన చోట వివాదాలకు వేదికలుగా మారతాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates