త్రివిక్రమ్… ఇది మామూలు డ్యామేజ్ కాదు

రచయితగా విక్టరీ వెంకటేష్ కు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో వెంకీ సినిమా కోసం ఎన్నో ఏళ్ల పాటు ఎదురు చూశారు అభిమానులు. ఎట్టకేలకు గత ఏడాది వీరి కలయికలో భారీ అంచనాల మధ్య ‘ఆదర్శ కుటుంబం’ సినిమా మొదలైంది. ఇది కూడా ఒక క్లాసిక్ అవుతుందని వీరి అభిమానులు ఆశించారు. కానీ ఈ చిత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్లు కూడా పర్వాలేదు అనిపించినప్పటికీ బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల బాక్సాఫీస్ లెక్కల్లో సినిమా పెద్ద ఫెయిల్యూరే అయింది.

ఎలాంటి దర్శకుడికి అయినా కెరీర్లో ఫెయిల్యూర్లు మామూలే. త్రివిక్రమ్ కు కూడా గతంలో డిజాస్టర్లు లేకపోలేదు. కానీ సినిమా ఫెయిల్ అవ్వడం వేరు. తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టి, వివాదాలు చుట్టుముట్టి మీడియాలో దీర్ఘ కాలం చర్చల్లో ఉండడం వేరు. ఆదర్శ కుటుంబం విషయంలో అదే జరుగుతోంది. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా మ్యూజిక్ డైరెక్టర్ సహా కొందరు టెక్నీషియన్లు మారడం.. వేరే సినిమాతో పోలికలు వచ్చి స్క్రిప్టు మారి రీషూట్లు జరగడం.. పలుమార్లు సినిమా వాయిదా పడి రిలీజ్ డేట్లు మారడం వల్ల చిన్న సినిమాలకు ఇబ్బంది రావడం.. ఇలా ఎన్నో వివాదాలు ముసురుకుని త్రివిక్రమ్ మీద విమర్శలు తప్పలేదు.

ఇక రిలీజ్ తర్వాత సినిమా కంటెంట్ విషయంలో త్రివిక్రమ్ ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నాడో తెలిసిందే. ఇటీవల వచ్చిన ‘మాలా’ పాట విషయంలో నెటిజన్లు ఆయన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇంతలో యువ నటి పూజిత పొన్నాడ లైన్లోకి వచ్చింది. ఈ సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇస్తామని ఆశ చూపించి, ఆడిషన్ చేసి.. చివరికి వేరొక నటితో తనను రీప్లేస్ చేశారని, తనకి క్రెడిట్ కూడా ఇవ్వని టీం తన మీద తీసిన ఒక అప్రాధాన్యమైన సీన్ మాత్రం సినిమాలో పెట్టేశారని వాపోయింది.

పూజిత చెబుతున్న దాని ప్రకారం, ఆదర్శ కుటుంబం యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే త్రివిక్రమ్ అండ్ కో ముందు అనుకున్న కథ ఒకటి. అందుకు తగ్గట్లు సన్నివేశాలను రాసుకుని.. షూట్ మొదలు పెట్టారు. కానీ మధ్యలో కథ మారింది. పాత్రధారులతో పాటు టెక్నీషియన్లు కూడా మారిపోయారు. మారిస్తే మార్చారు కానీ సినిమాలో వద్దు అనుకున్న పాత్ర మీద తీసిన సీన్ అలాగే సినిమాలో ఉంచేయడం దారుణం అంటున్నారు సినీ అభిమానులు.

పూజిత లాంటి కాస్త పేరున్న నటికి ఇది చాలా ఇబ్బంది కలిగించే విషయమే. ఆదర్శ కుటుంబం విషయాల్లో ఎన్ని తప్పులు జరిగాయో, షూటింగ్-ఎడిటింగ్ ఎంత కంగాళీ అయ్యాయో చెప్పడానికి ఇది మరో రుజువు. ఈ సినిమా త్రివిక్రమ్ ఇమేజ్ ను మామూలుగా డ్యామేజ్ చెయ్యట్లేదు.