9 కోట్ల మందు 2.5 లక్షలకే.. ఈవిడే అసలైన డాక్టరమ్మ!

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు మందులు అందుబాటులో ఉన్నా.. వాటి ధర కోట్ల రూపాయల్లో ఉండటంతో తల్లిదండ్రులు చికిత్స చేయించలేని పరిస్థితులు ఉన్నారు. ఇలాంటి కుటుంబాలకు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ అండగా నిలిచారు. ఏడాదికి రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యే అరుదైన వ్యాధి ఔషధాన్ని కేవలం రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో విజయం సాధించారు. అంతేకాదు.. ఈ మందును ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య రంగంలో అందుబాటులో ఉన్న చికిత్స సామాన్య కుటుంబాలకు కూడా చేరాలనే లక్ష్యంతో ఆమె చేసిన ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని సంతోష్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. అలన్ హెర్న్డన్ డడ్లీ సిండ్రోమ్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు టిరాట్రికోల్ అనే ఔషధం అవసరమవుతుంది. అయితే మార్కెట్‌లో లభించే ఈ మందు ధర ఒక్కో చిన్నారికి ఏడాదికి సుమారు రూ.4.68 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఉంటుంది. ఇంత భారీ మొత్తాన్ని భరించడం సాధారణ కుటుంబాలకు దాదాపు అసాధ్యమే.

ఈ సమస్యను గుర్తించిన డాక్టర్ శివరంజని ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నించారు. యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియా సహకారంతో అంతర్జాతీయ సంస్థలను సంప్రదించారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ అకౌంటబిలిటీ ఫౌండేషన్, అక్కడి ది హేగ్‌లో ఉన్న ట్రాన్స్‌వాల్ ఫార్మసీ సహకారంతో మందును ప్రత్యేక పద్ధతిలో తయారు చేసే అవకాశం ఏర్పడింది. ఫార్మాస్యూటికల్ కాంపౌండింగ్ విధానంలో రూపొందించిన ఈ ప్రత్యామ్నాయ ఔషధం వల్ల ఏడాది చికిత్స ఖర్చు ఒక్కో చిన్నారికి సుమారు రూ.2.5 లక్షలకు తగ్గింది.

ఈ ప్రయత్నానికి మొదట కారణమైనది అరవ్ అనే చిన్నారి పరిస్థితి. ఆ బిడ్డకు అరుదైన వ్యాధి నిర్ధారణ కావడంతో చికిత్స కోసం కుటుంబం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంది. జర్మనీ నుంచి కేవలం నెల రోజులకు సరిపడా మందులు తెప్పించడానికి రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో డాక్టర్ శివరంజని మందును తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చే మార్గాలను అన్వేషించారు. సెప్టెంబర్ 7న సోషల్ మీడియా ద్వారా సహాయం కోరుతూ చేసిన విజ్ఞప్తి నెదర్లాండ్స్ సంస్థ దృష్టికి వెళ్లడంతో ప్రయత్నాలకు మరింత ఊతం లభించింది.

మొదట అరవ్‌తో పాటు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురు చిన్నారులను గుర్తించారు. ఆ తర్వాత మరో ఏడాది వయసున్న చిన్నారి కూడా ఈ జాబితాలో చేరడంతో మొత్తం ఏడుగురికి మందులు అందించే ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల 30న తొలి విడత మందులను పిల్లల తల్లిదండ్రులకు అందించనున్నారు. మందుల నిల్వ కాలం ఆరు నెలలే కావడంతో రెండు విడతల్లో దిగుమతి చేయాలని నిర్ణయించారు.

ఈ ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు మందులు అందించడానికి మొత్తం 14,200 యూరోలు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.15.08 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో డాక్టర్ శివరంజని భారత్‌లో సుమారు రూ.6.09 లక్షలు సమీకరించగా, మిగిలిన మొత్తాన్ని నెదర్లాండ్స్ సంస్థ సేకరించనుంది. దీంతో ఏడుగురు చిన్నారులకు మందులు ఉచితంగా అందనున్నాయి.

అయితే విదేశాల నుంచి మందులు దిగుమతి చేసుకోవడం శాశ్వత పరిష్కారం కాదని డాక్టర్ శివరంజని భావిస్తున్నారు. ఈ ఔషధాన్ని భారత్‌లోనే తయారు చేసి మరింత మంది చిన్నారులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక చిన్నారి చికిత్స కోసం మొదలైన ప్రయత్నం ఏడుగురు పిల్లలకు కొత్త ఆశలు కల్పించడం విశేషం. అరుదైన వ్యాధుల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ ధరల కారణంగా చికిత్సకు దూరమవుతున్న కుటుంబాలకు ఈ పరిణామం ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తోంది.