ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే.. ఈ మొత్తం పర్యటనలో ప్రధానితో పాటు ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి విజయ్ కూడా పాల్గొన్నారు. కొత్తగా ప్రారంభించిన మెట్రో రైల్లో ఇరువురు కలిసి కొద్దిదూరం ప్రయాణించారు. అయితే.. ఈ పూర్తి ప్రధాని పర్యటనలో ముఖ్యమంత్రి విజయ్ నల్లదుస్తులు(బ్లాక్ డ్రెస్) ధరించి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయ పక్షాలు వేర్వేరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రస్తుతం దేశంలో సర్ కు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ.. పెద్ద ఎత్తున నిరసనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కారు(టీవీకే) కూడా సర్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేయడంతోపాటు.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కూడా సమర్థించింది. అయితే.. ప్రత్యక్ష నిరసనలకు మాత్రమే టీవీకే దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనలో సీఎం విజయ్ పూర్తిస్థాయిలో చొక్కా, ఫ్యాంటు కూడా నల్ల దుస్తులనే వేసుకోవడం.. అదేసమయంలో ఆయన ముభావంగా వ్యవహరించడం వంటివి ఆసక్తిగా మారాయి.
వ్యూహాత్మకమే: డీఎంకే
ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నాయకులు స్పందిస్తూ.. విజయ్ చేసిన పని వ్యూహాత్మకమేనని.. ఆయన ఉద్దేశ పూర్వకంగానే నల్లదుస్తులు ధరించారని వ్యాఖ్యానించింది. ఇది కేవలం తమిళ ప్రజలను ఏమార్చేందుకు చేసిన విన్యాసంగా పేర్కొంది. తమిళనాడులో సర్ కారణంగా 78 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని.. వీటికి నిరసన తెలియజేయాల్సిన సమయంలో ప్రజలకు ఊరటకల్పించాల్సిన సమయంలో విజయ్.. మోడీ ముందు నల్లదుస్తులు వేసుకుని నటించారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విన్యాసాలను ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక, ఈ వ్యవహారంపై టీవీకే నాయకులు మౌనంగా ఉన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి హాజరయ్యారని, దుస్తులను రాజకీయం చేస్తారా? అని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానించారు.
బీజేపీ మౌనం
ముఖ్యమంత్రి విజయ్ ఆహార్యంపై బీజేపీ మౌనంగా ఉంది. డీఎంకే ఈ విషయాన్ని రాజకీయంగా విమర్శలు గుప్పించినప్పటికీ.. బీజేపీ నాయకులు ప్రధాని పర్యటన కావడంతో దీనిపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఇక, మరోప్రతిపక్షం అన్నాడీఎంకే ఉన్నప్పటికీ.. మోడీకి అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నాయకులు కూడా మౌనంగానే ఉన్నారు. విజయ్ డ్రెస్, ప్రధానితో ఆయన ముభావంగా వ్యవహరించడం వంటివి ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అదేసమయంలో పలువురు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates