సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా కాలం ఉంటుంది. అయితే వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పుల కారణంగా గత కొంతకాలంగా ఋతువుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ ఎల్ నినో దేశంలో బలంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో దీని ప్రభావం ఎక్కువగా చూపుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో చలికాలం మాయమైనట్లేనని నిపుణులు చెబుతున్నారు.
నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. వేసవి కాలం వెళ్లి పోయినప్పటికి ఇప్పటికీ ఎండలు అదర గొడుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాకాలం వచ్చింది కాని సరిపడా వర్షాలు కురవలేదు. నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 19 నుంచే తిరుగుముఖం పట్టినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా అయితే నైరుతి రుతు పవనాలు నిష్క్రమించిన తరువాత ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించాల్సి ఉంటుంది. అదికూడా ఎంత ప్రభావం చూపుతుందో వాతావరణ శాఖ చెప్పలేక పోతోంది. తెలంగాణాలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 30 శాతంపైగా లోటు వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా మంచు కురుస్తుంది. ఫిబ్రవరి చివరి వరకు చలికాలం ఉంటుంది. కానీ ఈసారి అక్టోబర్ నెల వచ్చినప్పటికీ ఎండలు తగ్గలేదు కదా మండిపోతున్నాయి. నాలుగు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్లో 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కడప, పల్నాడు జిల్లాల్లో కూడా 35 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇవి సాధారణం కన్నా 4 డిగ్రీలు ఎక్కువ.
రానున్న రెండు నెలల్లో ఎల్నినో ప్రభావం మరింత తీవ్రంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే భారత దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. అందులోనూ దక్షిణ భారతదేశంలో మరింత ఎక్కువగా ఎండలు ఉంటాయని, 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ఈసారి వడగాలులకు జనాలు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం వుందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates