తొలి టెస్టులో ఘోర పరాభవం ఎదురైంది. ఒక ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలిన పరాభవ భారం వెంటాడుతోంది. విరాట్ కోహ్లి, షమి అందుబాటులో లేకుండా పోయాడు. ఈ స్థితిలో ఆస్ట్రేలియాపై భారత జట్టు సిరీస్ గెలవడం కాదు కదా.. గౌరవప్రదంగా ఓడి అయినా ఇంటిముఖం పడుతుందని ఎవ్వరైనా అనుకున్నారా? కానీ అద్భుతం.. అనూహ్యం.. అసాధారణం.
ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టికరిపించి, సిరీస్ విజయంతో స్వదేశానికి సగర్వంగా బయల్దేరబోతోంది టీమ్ ఇండియా. మెల్బోర్న్లో అనూహ్యంగా పుంజుకుని గొప్ప విజయం సాధించి.. సిడ్నీలో పరాభవం తప్పదనుకున్న సమయంలో అసాధారణంగా పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించి.. ఇప్పుడు బ్రిస్బేన్‌లో డ్రా చేసుకుంటే గొప్ప అనుకున్న మ్యాచ్‌లో ఏకంగా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలనం సృష్టించింది భారత జట్టు. మన దేశ క్రికెట్ చరిత్రలోనే అది అత్యద్భుత విజయాల్లో ఒకటనడంలో సందేహమే లేదు.
తొలి టెస్టు తర్వాత కోహ్లి, షమి జట్టుకు దూరమైతే.. ఆ తర్వాతి రెండు టెస్టుల్లో ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డారు. చివరి టెస్టుకు వచ్చేసరికి కనీసం ఫిట్‌గా ఉన్న పదకొండు మంది దొరుకుతారా లేదా అని భయం నెలకొన్న పరిస్థితి. ఈ స్థితిలో నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైని లాంటి కొత్త ముఖాలతో జట్టును నింపుకోవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో కూడా గాయం బెడద వీడలేదు. సైని గాయం కారణంగా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేని పరిస్థితి.
అయినా సరే.. భారత జట్టు వెన్ను చూపలేదు. అద్భుతంగా పోరాడింది. ఏ దశలోనూ వెనుకంజ వేయలేదు. 328 పరుగుల భారీ లక్ష్యం ముందుండగా.. గబ్బాలో చివరి రోజు భారత్ పోరాడిన తీరు చరిత్రాత్మకం.
అందరూ ఈ మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించి సిరీస్ సమం చేసినా చాలు అనుకున్నారు. అలాంటిది ఏకంగా అంతటి లక్ష్యాన్ని ఛేదించి సంచలనం సృష్టించింది. పుజారా (56) పదే పదే ఒంటికి తగులుతున్న బంతుల్ని లెక్క చేయకుండా మొండిపట్టుదలతో నిలిస్తే.. యువ ఆటగాళ్లు గిల్ (91), పంత్ (89 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు. 2018లోనూ ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది.
ఆ దేశంలో టీమ్ ఇండియాకు అదే తొలి సిరీస్. కానీ అప్పుడు స్మిత్, వార్నర్ లేకపోవడం వల్లే భారత్ గెలిచిందన్నారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు. భారత్ కోహ్లి సహా ఎంతోమంది కీలక ఆటగాళ్లను దూరం చేసుకుంది. అయినా సరే.. అద్భుత విజయం సాధించి ఔరా అనిపించింది.