13 రోజుల చిన్నారికి పాస్పోర్ట్ – రికార్డ్ సృష్టించిన తెలుగు బిడ్డ

పుట్టిన 13 రోజులకే పాస్పోర్ట్ తీసుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని దాసన్నపేటకు చెందిన వజ్రపు ఆశీష్ లండన్ లో పాస్టర్గా చేస్తుంటారు. ఆయన భార్య గీతా మాధురి పుట్టింట్లో ఈ ఏడాది మే 30 వ తేదీన అగస్త్య ప్రిన్సీ పుట్టింది. లండన్ నిబంధనల ప్రకారం అక్కడ నివాసం వుండాలంటే బర్త్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. కనుక ప్రిన్సీ పుట్టిన మరుసటి రోజే బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారు. చిన్నారిని లండన్ తీసుకొని వెళ్లాలంటే పాస్పోర్ట్ అవసరం ఉంటుంది. కనుక వెంటనే పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 13 వ రోజుకల్లా పాస్పోర్ట్ కూడా వచ్చేసింది.

పుట్టిన 13 రోజులకే పాస్పోర్ట్ తీసుకోవడం ప్రపంచంలో చాలా అరుదనే చెప్పాలి. దాంతో అతి చిన్న వయసులో పాస్పోర్ట్ తీసుకున్న చిన్నారిగా ప్రిన్సీ పేరును ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేశారు. ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలన వార్తగా మారింది. దాంతో ప్రిన్సీ తరహాలో ఎవరైన పాస్పోర్ట్ తీసుకున్న వారున్నారా అని గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. మన దేశంలో పుట్టిన 19 రోజులకు పాస్పోర్ట్ తీసుకున్న చిన్నారి ఉన్నట్టు తెలిసింది.

గుజరాత్ కు చెందిన కృష్ణ ప్రియాంక భట్ అనే చిన్నారి పుట్టిన 19 రోజులకే పాస్పోర్ట్ పొందినట్లు రికార్డులు వున్నాయి. ఈ చిన్నారి పేరు కూడా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. అయితే ఈ చిన్నారికి సంబందించిన పూర్తి వివరాలు లేవు. మరో చిన్నారి కూడా పుట్టిన 19 రోజులకు పాస్పోర్ట్ పొందాడు. మహారాష్ట్రలోని నాసిక్ లో 2025 జూన్ 4 వ తేదీన పుట్టిన వీర్ ప్రమోద్ జాదవ్ కు జూన్ 24 వ తేదీన పాస్పోర్ట్ మంజూరయ్యింది. ప్రస్తుతం ఇచ్చాపురం చిన్నారి ప్రిన్సీ ప్రపంచంలోనే అతి పిన్న వయసులో పాస్పోర్ట్ పొందిన రికార్డ్ సొంతం చేసుకుంది.