ఈత రాదు.. చేతులకు గ్లౌజులు లేవు.. కాళ్లకు బూట్లు కూడా లేవు. అయినా నదిలోకి దిగాడు. ప్లాస్టిక్, చెత్తతో కలుషితమైన అజ్నార్ నదిని చూసి ఎవరో వచ్చి శుభ్రం చేస్తారని ఎదురుచూడకుండా తానే రంగంలోకి దిగాడు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరాకు చెందిన 20 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి సురేంద్ర సింగ్ చౌదరి.
‘బిట్టూ తబాహీ’గా సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందిన అతడు జనవరి 26, 2026 నుంచి నదిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగిస్తూ తన సొంత డబ్బుతో అవసరమైన పరికరాలు, చెత్త బుట్టలు కొనుగోలు చేసి స్నేహితుల సహకారంతో పనిని కొనసాగించాడు. ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు దాదాపు రూ.30 వేల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
నదిలో చెత్త తొలగింపుతో పాటు పూజా కార్యక్రమాల అనంతరం పడేసే వ్యర్థాలను సేకరించి కంపోస్టుగా మార్చే ప్రయత్నం కూడా ప్రారంభించాడు. కలుషిత నీటిలోకి దిగి పనిచేసే క్రమంలో చేతులకు ఇన్ఫెక్షన్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. నదిలోని అత్యంత కలుషితమైన ఓ ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు సుమారు రెండు నెలల పాటు నిరంతరంగా శ్రమించినట్లు ఇటీవల వెలువడిన కథనాలు పేర్కొంటున్నాయి.
శుభ్రం చేయడానికి ముందు, తర్వాత తీసిన చిత్రాల్లో ఆ ప్రాంతంలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది. తన పనిని సామాజిక మాధ్యమాల్లో నమోదు చేయడంతో వేలాది మంది అతడి ప్రయత్నాన్ని గమనించారు. అయితే కొందరు లైకులు, ప్రచారం కోసమే ఇలా చేస్తున్నాడంటూ విమర్శించినా వాటిని పట్టించుకోకుండా బిట్టూ తన సేవను కొనసాగించాడు.
అతడి ప్రయత్నానికి పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ప్రశంసలు తెలిపారు. ఆరోగ్య సమస్యలు, ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గని 20 ఏళ్ల యువకుడి పట్టుదల.. సమస్యను చూసి విమర్శించడం కంటే పరిష్కారం కోసం మన వంతు ప్రయత్నం చేయాలనే సందేశాన్ని ఇస్తోంది.
ఇక బిట్టూ చేసిన ఈ మంచి పనికి అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ది ఓషన్ క్లీనప్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ బోయన్ స్లాట్ బిట్టూ చేసిన పనిని గుర్తించారు.
బిట్టూ అంకితభావాన్ని మెచ్చుకున్న బోయన్ స్లాట్.. తమ సంస్థలో పనిచేసే అవకాశం ఇచ్చారు. అంతేకాదు, నెదర్లాండ్స్‌కు వచ్చి తమ సంస్థతో కలిసి పనిచేయాలని బిట్టూను ఆహ్వానించారు. ఇప్పటివరకు ఒక నదిని శుభ్రం చేసేందుకు ఒంటరిగా పోరాడిన బిట్టూ ప్రయాణం.. ఈ ఆఫర్‌తో మరో కీలక మలుపు తిరిగింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates