అలక వీడిన కోమటిరెడ్డి?

సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే పలుమార్లు విమర్శలు గుప్పించారు. అయితే, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, ఎల్లుండి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వంటి పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ తలుపులు తెరుచుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ లో జరిగిన బహిరంగ సభలో రాజగోపాల్ రెడ్డిని మిత్రుడు అని సంబోధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘‘మీ అభిమాన నాయకుడు, మిత్రుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి’’ అని రేవంత్ రెడ్డి అనగానే రాజగోపాల్ రెడ్డి అభిమానులు, అనుచరుల కేకలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. కొంతకాలంగా రేవంత్ రెడ్డితో ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న రాజగోపాల్ రెడ్డి సభా వేదికపై రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవడం విశేషం.

ఇక, ప్రియ మిత్రుడు, మునుగోడు శాసన సభ్యుడు రాజగోపాల్ రెడ్డి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబోధించినప్పుడు కూడా సభ కేకలతో హోరెత్తింది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సంబోధనను రాజగోపాల్ రెడ్డి తన ఇలాకాలో జరిగిన ఈ సభలో బల ప్రదర్శన గట్టిగానే చేసినట్లు అనిపించింది. తనకు బెర్త్ ఖాయం అని రాజగోపాల్ రెడ్డి ఈ సభకు హాజరయ్యారు. వాస్తవానికి, కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు, సీఎం రేవంత్ రెడ్డి సభలకు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఈ సభకు ఆయన హాజరయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డితో రాజీ కుదిరినట్లే అనిపిస్తోంది