సుహాస్ & సూరి… చావో రేవో తేలిపోవాలి  

టాలెంట్ ఉన్నప్పటికీ సక్సెస్ విషయంలో యుద్ధం చేసినట్టుగా పోరాడుతున్న సుహాస్ ఇప్పుడు కోలీవుడ్ లో అడుగు పెట్టాడు. భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందిన మందాడి తెలుగులోనూ సమాంతరంగా సెప్టెంబర్ 10 విడుదల కానున్న సంగతి తెలిసిందే. కల్ట్ ఫిలిం మేకర్ వెట్రిమారన్ నిర్మాణంలో మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించగా కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి ఇందులో కథానాయకుడు. సుహాస్ చేసింది నెగటివ్ రోలే అయినా స్టోరీ పరంగా చాలా ప్రాధాన్యం ఉంటుంది.

క్యాస్టింగ్ పరంగా కాకుండా కంటెంట్, బడ్జెట్ కోణంలో చూస్తే మందాడి చిన్న సినిమా కాదు. తీర ప్రాంతాల్లో తెరచాప పడవలను ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అయినా సమర్ధవంతంగా నడిపించే నాయకులను మందాడి అని పిలుస్తారు. సుహాస్, సూరి చేసింది ఈ పాత్రలే. రామనాథపురం, తూత్తుకుడి ప్రాంతాల్లో ఇవి చాలా ఫేమస్. ప్రతి ఏడాది జరిగే పోటీలకు లక్షల మంది హాజరవుతారు. ప్రమాదకర విన్యాసాల్లో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి.

చాలా రిస్క్ చేసి నిజమైన సముద్రంలో మందాడి షూటింగ్ చేశారు. నెలల తరబడి ప్రాణాలు రిస్కులో పెట్టి మరీ సూరి, సుహాస్ దీని కోసం కష్టపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ ఇకపై చచ్చినా ఇలాంటి సినిమాలు చేయనని స్టేట్ మెంట్ ఇవ్వడం చూస్తే ఏ స్థాయిలో తెగించి చేశారో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో మంచి పబ్లిసిటీ చేస్తున్నారు. సత్యరాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఇందులో చాలానే ఉన్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం మరో ఆకర్షణ కానుంది.

టాలీవుడ్ వరకు చూసుకుంటే మందాడికి పోటీ పరంగా రిస్క్ అయితే ఉంది. ఆనంద్ దేవరకొండ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్, సుమంత్ మహేంద్రగిరి వారాహి, కార్తీ సర్దార్ 2, మాధవ్ భూపతిరాజు మారెమ్మలు పోటీలో ఉన్నాయి. వీటిని తట్టుకుని మందాడి నిలవాల్సి ఉంటుంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లోనే నాగచైతన్య తండేల్ రూపంలో హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. కాకపోతే అది ఎమోషనల్ లవ్ స్టోరీ కాగా మందాడి పూర్తిగా యాక్షన్, థ్రిల్స్ మీద నడిచే సర్వైవల్ స్పోర్ట్స్ డ్రామా.