కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల ఫలితాలు చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత గుర్తుకొస్తుంది. గత వారం విడుదలైన టాక్సిక్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంత తిరస్కారానికి గురయ్యిందో తెలిసిందే. రిజల్ట్ దెబ్బకు టీమ్ కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయింది. హీరో యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఆన్ లైన్ కే పరిమితం కాగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ టీమ్ కంటెంట్ ని తీవ్రంగా విమర్శించిన వాళ్లకు లీగల్ నోటీసులను పంపడంలో బిజీగా ఉంది. ఇదంతా వారంలోనే జరిగిపోయింది.
నిన్న ఇంగ్లీష్ వెర్షన్ ని ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. సుమారు పద్దెనిమిది నిమిషాల దాకా ట్రిమ్ చేసి ఆ విషయాన్నే ఎక్కువగా హైలైట్ చేసుకున్నారు. కట్ చేస్తే దీన్ని కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని నెంబర్లు చెబుతున్నాయి. ట్రేడ్ టాక్ ప్రకారం దేశం మొత్తం మీద చాలా పరిమిత షోలలో కేవలం నాలుగు వందల యాభై టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయట. అంటే వసూళ్లు చూసుకుంటే లక్షన్నర కూడా దాటి ఉండదు. నిజమైతే మటుకు ఇది చాలా అంటే చాలా పెద్ద షాక్.
అసలు ప్రత్యేకంగా హాలీవుడ్ వెర్షన్ ఎందుకు విడుదల చేశారనే సందేశం రావడం సహజం కదా. దానికి కారణం ఉంది. టాక్సిక్ షూటింగ్ జరుగుతున్న టైంలోనే సమాంతరంగా రెండు భాషల్లో షూట్ చేశారు. అంటే ఒకే సన్నివేశాన్ని రెండు సార్లు తీసుకుంటూ వచ్చారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా యష్ రిస్క్ చేశాడు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని మెప్పిస్తుందనే నమ్మకంతో, ఆస్కార్ కి దారులు మరింత దగ్గరవుతాయనే ఆశతో. అవేవి ఫలించలేదు.
ప్రస్తుతం కర్ణాటకలో మాత్రమే టాక్సిక్ కి చెప్పుకోదగ్గ షోలు కనిపిస్తున్నాయి. శాండల్ వుడ్ కు మరో వంద కోట్ల గ్రాసర్ అవుతుందన్న ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కష్టంగా ఉంది. ఆ ఒక్క రాష్ట్రాన్ని విడిగా చూసుకుంటే ఫైనల్ రన్ ఎనభై కోట్ల దగ్గర ఆగిపోవచ్చని బయ్యర్ వర్గాల అంచనా. తెలుగుతో సహా మిగిలిన భాషల్లో వాషౌట్ అయిపోగా ఓటిటిలో వచ్చాక దీనికి ఎలాంటి స్పందన ఉంటుందో వేచి చూడాలి. యష్ మార్కెట్ మీద టాక్సిక్ ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates