30 ఏళ్లకుపైగా తాను నడిపిన బస్సుకు ఓ డ్రైవర్ భావోద్వేగ వీడ్కోలు పలికిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) ఇడుక్కి జిల్లాలోని కుమిలి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాల్ కురియన్ సెప్టెంబరు 2న తన చివరి విధి నిర్వహించారు.
చివరి ట్రిప్ ముగించుకుని బస్సును డిపోలో పార్క్ చేసిన అనంతరం ఆయన కొద్దిసేపు స్టీరింగ్ వద్దే ఉండిపోయారు. అనంతరం స్టీరింగ్‌కు ఆప్యాయంగా ముద్దుపెట్టి.. బస్సుకు సెల్యూట్ చేశారు. తనతో ఇన్నాళ్లు ప్రయాణించిన వాహనాన్ని చివరిసారిగా చూసుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు.
ఈ దృశ్యాలను కేఎస్‌ఆర్‌టీసీ అధికారులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో విస్తృతంగా వైరల్ అయ్యాయి. డ్రైవర్ పాల్ కురియన్ వృత్తిపై చూపిన అంకితభావం, బస్సుతో ఏర్పడిన అనుబంధాన్ని చూసి పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పదవీ విరమణ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భావోద్వేగ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
ఏళ్ల తరబడి తాను నడిపిన బస్సుకు పదవీ విరమణ సందర్భంగా డ్రైవర్ పాల్ కురియన్ వంగి నమస్కరించిన దృశ్యం పలువురిని కదిలించింది. ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న వేలాది మంది కార్మికుల నిబద్ధత, వృత్తిపై గర్వమే సంస్థకు నిజమైన బలమని కేరళ ప్రభుత్వం పేర్కొంది. పాల్ కురియన్ వంటి ఉద్యోగుల సేవలు ప్రజా రవాణా వ్యవస్థకు ఎంతో విలువైనవని తెలిపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates