బూతులతో ప్యారడైజ్ చూడాలంటే అక్కడే

ట్రైలర్ రాలేదు. అసలు సమయమే లేదని ఆ ఆలోచన మానుకున్నారు. రెండు మాస్ సాంగ్స్ తీసుకొచ్చిన బజ్ తప్ప ఇంకే స్పెషల్ కంటెంట్ విడుదల చేయలేదు. టీజర్ కూడా చిన్నది వదిలారు తప్పించి ట్రెండ్ కు అనుగుణంగా నిడివి ఎక్కువగా ఉన్నది ఇవ్వలేదు. బోలెడు ఆలస్యాలు, వాయిదాలు అన్నీ జరిగాయి. అయినా ప్యారడైజ్ హైప్ మీద వీటి ప్రభావం ఇనుమంత కూడా లేదని బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇండియన్ వెర్షన్ లో సెన్సార్ కట్స్, మ్యూట్స్ అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఏకంగా 21 సవరింపులు ఇచ్చి అధికారులు దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చారు. ఇవి లేకుండా అన్ కట్ చూడాలంటే నార్త్ అమెరికా లాంటి విదేశాలకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఎలాంటి కత్తిరింపులు లేకుండా ఒరిజినల్ వెర్షన్ ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ అధికారికంగా చెప్పడంతో అక్కడి అభిమానుల్లో ఆసక్తి రెట్టింపయ్యింది. ఇప్పటికే వన్ మిలియన్ మార్క్ దాటేసిన ప్యారడైజ్ మొదటి ఆట పడే లోపు ఒకటిన్నర అందుకుంటుందా లేదానే దాని గురించి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలుగు తెరమీద ఎప్పుడూ చూడనంత ఇంటెన్స్ వయొలెన్స్ తో పాటు కొన్ని బూతులు కూడా ఇందులో పొందుపరిచారనే టాక్ ముందు నుంచి ఉంది. దానికి తగ్గట్టే లీకుల్లో ఉన్న సమాచారం ప్రకారం యాక్షన్ ఎపిసోడ్లు ఆషామాషీగా లేవు. రక్తపాతం ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు అందటం కష్టమనే రేంజ్ లో డిజైన్ చేశారట. సో ఎంతైనా అంచనాలు పెట్టుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల రాత్రి 9.30 నుంచి షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఎలాంటి ఆలస్యం జరగదు.

పాజిటివ్ టాక్ వస్తే మటుకు ప్యారడైజ్ చేయబోయే విధ్వంసం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రీ పాజిటివ్ టాక్స్ వినిపిస్తున్న నేపథ్యంలో బయ్యర్ వర్గాలు ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచే సోషల్ మీడియా మోత మోగిపోవడం ఖాయం. న్యాచురల్ స్టార్ నాని గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు. దానికి తగ్గ రిజల్ట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొద్ది గంటలు ఆగితే సరి.