నేపాల్ వరదల్లో తెలుగువాళ్ళని కాపాడిన టీ

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టడని పెద్దలు చెప్పే మాట నిజమని మరోసారి రుజువయ్యింది. కైలాస మానస సరోవర యాత్ర కోసం నేపాల్ వెళ్లిన మన తెలుగువారు తృటిలో తప్పించుకున్నారు. మార్గమధ్యలో టీ తాగేందుకు ఆగడమే వారికి శ్రీరామ రక్ష గా కాపాడింది. తెలుగు ప్రయాణికుల ప్రాణాలను ‘టీ ‘ కాపాడిందని జాతీయ మీడియా, సోషల్ మాధ్యం ప్రచారం చేస్తున్నాయి.

తిరుపతికి చెందిన 26 మంది యాత్రికులు సైన్ ఇన్ ట్రావెల్స్ ద్వారా కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లారు. ఖాట్మండ్ చేరుకొని ఒక హోటల్లో బస చేశారు. ఐదుగురు యాత్రికులు హోటల్లో వుండిపోగా మిగిలిన 21 మంది అక్కడ నుంచి బయలుదేరారు. బస్సు ఖాట్మండ్ నుంచి బయలుదేరిన తర్వాత దారి మధ్యలో ఒక చోట హోటల్ వద్ద టీ తాగేందుకు అరగంట పాటు ఆగారు. హోటల్ సమీపంలో వున్న వంతెన మీదుగా వాళ్ళు ప్రయాణం చేయాల్సిన వుంది. ఈ లోపు కొండ చరియలు విరుచుకొని పడ్డాయి. చూస్తూ చూస్తుండగానే వరద విరుచుకొని పడింది. వంతెన మొత్తం కొట్టుకొని పోయింది.

తిరుపతి ప్రయాణికుల కంటే ముందు వెళ్లిన లగేజీ వాహనం కొండచరియలు విరుచుకొని పడటంతో వంతెన మీదే నిలిచిపోయింది. దీంతో ఒక్కసారిగా పోటెత్తిన వరదలకు స్థానికులు అప్రమత్తం అయ్యారు. బస్సు డ్రైవర్ ను వెనక్కి రావాల్సిందిగా హెచ్చరించారు. వెంటనే అలర్ట్ అయిన బస్సు డ్రైవర్ బస్సును వెనక్కి తిప్పి ఎత్తయిన ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు. దాంతో తెలుగు ప్రయాణికులు వరద రక్కసి బారిన పడకుండా తప్పించుకున్నారు. కేవలం 50 నుంచి 100 మీటర్ల దూరం నుంచే విలయతాండవం చేసిన వరదను చూసి భయంతో వణికి పోయారు. బస్సు వెనక్కి తిప్పిన 5 నిముషాల్లోనే వంతెన మొత్తం కొట్టుకొని పోయింది. వంతెన పరిసరాలు కనుమరుగయ్యాయి.

తాము కనుక దారి మధ్యలో టీ తాగకుండా వెళ్ళిపోయి వుంటే పరిస్థితి మరోలా వుండేదని తిరుపతి కి చెందిన ప్రయాణికులు చెప్పారు. నేపాల్ వరద విలయం గురించి చెబుతుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుందని న్యూ ఢిల్లీ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు . ప్రమాదం నుంచి బయట పడిన తరువాత ఒక హోటల్లో బస చేసిన యాత్రికులు సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. తిరుపతికి చెందిన యత్రికులు మీడియాతో మాట్లాడారు.