అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద వదిలి దంపతులు నదిలో దూకినట్లు పోలీసులు తెలిపారు. చీకట్లో వణుకుతూ ‘అమ్మా.. నాన్నా’ అంటూ ఆ చిన్నారి ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం స్థానికులను కలచివేసింది.
తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు. డ్రైవర్‌గా పనిచేసే సాయి అప్పుల పాలై వాటిని తీర్చలేక కొంతకాలం క్రితం భీమవరం వచ్చారు. వీరికి మూడేళ్ల క్రితం కవల పిల్లలు జన్మించారు. అప్పుల బాధలు ఇక్కడా వెంటాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
గురువారం రాత్రి తమ పాపను వెంట తీసుకుని స్కూటీపై ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఉన్న దిండి–చించినాడ వశిష్ఠ వంతెన వద్దకు వచ్చినట్లు సమాచారం. రాత్రి 10 గంటల ప్రాంతంలో స్కూటీని వంతెనపై నిలిపి, మూడేళ్ల పాపను అక్కడే వదిలి దంపతులు గోదావరి నదిలో దూకినట్లు స్థానికులు తెలిపారు.
చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న యలమంచిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వంతెనపై ఉన్న స్కూటీ, చిన్నారిని గుర్తించారు. నదిలో దూకిన దంపతుల కోసం స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు.
అమ్మానాన్నల కోసం చిన్నారి ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. అప్పుల సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాల్సింది పోయి, తమపై ఆధారపడిన పసివాడిని అనాథగా వదిలి దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates