ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్ తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఐతే ఆమె మొత్తంగా క్రికెట్‌కేమీ గుడ్ బై చెప్పట్లేదు. ప్లేయర్‌గా మరి కొంత కాలం కొనసాగనుంది. నాయకత్వ బాధ్యతలు ఇంకొకరికి ఇవ్వడానికి ఇదే సమయం అని ఆమె భావించింది.
హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం భారత క్రికెట్ అభిమానులను భావోద్వేగానికి గురి చేసే విషయం అనడంలో సందేహం లేదు. ఎందుకంటే భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే ఆమెనే అత్యంత గొప్ప కెప్టెన్ అనడంలో మరో మాట లేదు. మొత్తంగా ప్రపంచ మహిళల క్రికెట్లోనూ మేటి సారథుల్లో ఒకరు హర్మన్‌ప్రీత్.
హర్మన్‌ప్రీత్ కెప్టెన్ అవ్వకముందు ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వేరు.. ఆమె వచ్చాక చూస్తున్న జట్టు వేరు. ఆమె కంటే ముందు తెలుగమ్మాయి మిథాలి రాజ్ కూడా జట్టును బాగానే నడిపించినప్పటికీ.. అప్పటికి టీంలో దూకుడు ఉండేది కాదు. ప్లేయర్లకు ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. భయం భయంగా ఆడేవాళ్లు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి జట్లను చూడగానే భయపడిపోయేవాళ్లు. 2000 ముందు వరకు పురుషుల జట్టు తరహాలోనే ఉండేది పరిస్థితి. ఐతే గంగూలీ వచ్చాక దూకుడు పెరిగి ప్రపంచ స్థాయి జట్టుగా ఎదిగినట్లు.. హర్మన్ ప్రీత్ వచ్చాక మహిళల టీం కూడా అలాగే ఎదిగింది.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లకు పోటీ ఇవ్వడమే కాదు.. వాటిని ఓడించడం కూడా అలవాటైంది. ఈ క్రమంలోనే గత ఏడాది అద్భుత ఆటతీరుతో వన్డే ప్రపంచకప్‌ను సాధించింది ఇండియన్ టీం. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో మరెన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది జట్టు. ఇటీవలే ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఇలా జట్టు రాతను మార్చిన హర్మన్‌ప్రీత్ ఇప్పుడు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసింది. ఆమె స్థానంలో స్మృతి మంధాన కెప్టెన్ అవడం లాంఛనమే. ప్రస్తుతం భారత జట్టుకు ఆమె వైస్ కెప్టెన్‌గా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates