అర్ధరాత్రి దాటింది.. రహదారిపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. కళ్లపై నిద్రమత్తు.. దృష్టి రహదారిపైనే ఉన్నా.. మెదడు మాత్రం నెమ్మదిగా స్పందించడం మొదలుపెడుతుంది. ఇలాంటి సమయంలో డ్రైవర్ అలసటను ముందుగానే గుర్తించి హెచ్చరిస్తే? ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచనకు రూపమే ‘ఇంటెల్లీ సీట్’.
ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ వెంకటేశ్ బాలసుబ్రమణియన్ నేతృత్వంలోని రిహాబిలిటేషన్ బయోఇంజినీరింగ్ బృందం, హరీతా సంస్థతో కలిసి ఈ స్మార్ట్ డ్రైవర్ సీటును అభివృద్ధి చేసింది. డ్రైవర్ ధరించే పరికరాలు, శరీరానికి అమర్చే ఎలక్ట్రోడ్లు, వైర్లు అవసరం లేకుండానే సీటులో అమర్చిన సెన్సర్లతో అలసటను గుర్తించడం దీని ప్రత్యేకత.
డ్రైవర్ అలసిపోతున్న కొద్దీ కూర్చునే భంగిమలో, శరీర కదలికల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. సీటు వెనుక భాగం, కుషన్‌లో అమర్చిన సెన్సర్లు ఈ మార్పులను గుర్తిస్తాయి. సేకరించిన సమాచారాన్ని వ్యవస్థ విశ్లేషించి డ్రైవర్ అలసట స్థాయిని అంచనా వేస్తుంది.
అలసట పెరుగుతున్నట్లు గుర్తిస్తే హెచ్చరికల తీవ్రతను క్రమంగా పెంచుతుంది. ముందుగా డ్యాష్‌బోర్డ్ లైట్, ఆ తర్వాత శబ్దం, చివరగా సీటులో వైబ్రేషన్ ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. అవసరమైతే వాహనాల నిర్వహణ సంస్థలకు కూడా హెచ్చరికలు పంపే అవకాశం ఉంది.
ఇంటెల్లీసీట్‌ను వాహనంలో ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు స్వతంత్రంగా పనిచేసేలా రూపొందించడం మరో ప్రత్యేకత. దీంతో రోడ్డుపై ఇప్పటికే తిరుగుతున్న ట్రక్కులు, బస్సుల్లోనూ భవిష్యత్తులో ఈ సాంకేతికతను అమర్చే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఒక సాధారణ డ్రైవర్ సీటును తెలివైన భద్రతా వ్యవస్థగా మార్చిన ఇంటెల్లీసీట్, డ్రైవర్‌కు సమయానికి విశ్రాంతి తీసుకోవాలని గుర్తు చేస్తుంది. వాణిజ్య వాహనాల్లో ఇది విస్తృతంగా అందుబాటులోకి వస్తే రహదారి భద్రతలో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates