కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు, పశువైద్యాధికారులు సోమవారం నిర్వహించిన దాడుల్లో సుమారు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యర్థాలను ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువుల నిర్వాహకులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను మేతగా వినియోగించడం వల్ల చేపలు వేగంగా బరువు పెరుగుతాయని చెబుతున్నారు. అయితే పచ్చి, కుళ్లిపోయిన వ్యర్థాలను నేరుగా చెరువుల్లో వేయడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా అధికారులు పేర్కొంటున్నారు. అపరిశుభ్రమైన వ్యర్థాల ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, విషపదార్థాలు చేపల శరీరంలోకి చేరి, వాటిని ఆహారంగా తీసుకునే మనుషులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా చేపల పెంపకంలో నూనె తీసిన చెక్క, బియ్యం తవుడు, ఫిష్ మీల్ తదితర పదార్థాలతో తయారు చేసిన దాణాను వినియోగిస్తారు. అయితే ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కొందరు నిర్వాహకులు చికెన్ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చికెన్ వేస్ట్‌తో చేపలు త్వరగా పెరిగి అధిక లాభాలు వస్తాయని భావిస్తున్నప్పటికీ, దీని వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates