ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ ఏకంగా స్పేస్‌లోనే ఏఐతో పనిచేసే కంప్యూటర్‌ను పెట్టింది. ‘టేక్‌మీ2స్పేస్’ అనే స్టార్టప్ తయారు చేసిన MOI-1A శాటిలైట్‌ను స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. గురువారం రాత్రి కాలిఫోర్నియా నుంచి బయలుదేరిన ఈ రాకెట్‌లో దాదాపు 130 పేలోడ్స్ ఉన్నాయి. వాటిలో మన హైదరాబాద్ కంపెనీ శాటిలైట్ కూడా ఒకటి.
అసలు ఈ శాటిలైట్ ఏం చేస్తుందంటే.. సాధారణంగా శాటిలైట్లు భూమిని ఫొటోలు తీసి, ఆ డేటా మొత్తాన్ని కింద ఉన్న కంప్యూటర్లకు పంపిస్తాయి. ఆ తర్వాత వాటిని పరిశీలించి మనకు కావాల్సిన సమాచారం తీసుకుంటారు. MOI-1Aలో మాత్రం ఆ పని స్పేస్‌లోనే జరుగుతుంది. అందులో ఉన్న కంప్యూటర్‌కు ఏఐ మోడల్ ఇస్తే.. శాటిలైట్ తీసిన డేటాను అక్కడే పరిశీలించి, అవసరమైన సమాచారం మాత్రమే భూమికి పంపిస్తుంది.
ఉదాహరణకు ఒక ప్రాంతంలో పంటలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ వేడి ఉంది, మైనింగ్ ఏ ప్రాంతంలో జరుగుతోంది లాంటి సమాచారం కావాలనుకుందాం. మొత్తం ఫొటోలు భూమికి పంపాల్సిన అవసరం లేకుండా ఏఐ అక్కడే వాటిని పరిశీలించి ఫలితాన్ని పంపించగలదు. ఇందుకోసం MOI-1Aలో ఎన్విడియా Orin NX ప్రాసెసర్లు, 2TB స్టోరేజ్‌తో పాటు భూమిని పరిశీలించేందుకు ప్రత్యేక కెమెరా కూడా ఉంది. వ్యవసాయం, మైనింగ్, ఇన్సూరెన్స్, సప్లై చైన్ రంగాలకు చెందిన 23 మంది కస్టమర్లు ఇప్పటికే ఇందులో చోటు బుక్ చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
టేక్‌మీ2స్పేస్‌కు ఇది మొదటి ప్రయత్నం కాదు. 2024లో చిన్న స్థాయిలో స్పేస్‌లోనే ఏఐ ప్రాసెసింగ్‌ను పరీక్షించింది. ఆ తర్వాత తయారు చేసిన MOI-1 శాటిలైట్‌ను ఈ ఏడాది జనవరిలో ఇస్రో PSLV-C62 ద్వారా పంపారు. కానీ రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో ఆ శాటిలైట్‌ను కోల్పోయారు. దాని స్థానంలోనే MOI-1Aను తయారు చేసి, ఈసారి స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో పంపించారు. ప్రస్తుతం అది అంతరిక్షంలోకి చేరగా, మరో వాహనం ద్వారా కావాల్సిన కక్ష్యలోకి తీసుకెళ్లనున్నారు. అక్టోబర్ 8 నాటికి దాన్ని నిర్ణయించిన కక్ష్యలో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేశారు. అక్కడ పరీక్షలు పూర్తయితే ఈ విధానాన్ని మరిన్ని శాటిలైట్లకు విస్తరించాలని హైదరాబాద్ కంపెనీ భావిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
