భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు ఎదురుపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ రావడం లేదు. గత ఏడాది నుంచి ట్రోఫీ విషయంలో భారత్‌తో రెండుసార్లు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న నఖ్వీ.. ఈసారి భారత్ పాక్ ఫైనల్‌కు దూరంగా ఉంటున్నారు.
2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. కానీ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు అంగీకరించలేదు. మరో అధికారితో ట్రోఫీ ఇప్పించాలని భారత్ కోరినా అది జరగలేదు. చివరకు ట్రోఫీ తీసుకోకుండానే భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ వ్యవహారం కొంతకాలం కొనసాగింది.
ఇటీవల మహిళల ఆసియా కప్‌లోనూ దాదాపు ఇదే జరిగింది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించిన భారత మహిళల జట్టు కూడా నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోలేదు. నఖ్వీ కాకుండా మరో అధికారి ట్రోఫీ ఇవ్వాలని బీసీసీఐ కోరింది. దానికి అంగీకారం రాకపోవడంతో భారత జట్టు ట్రోఫీ లేకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ నిర్ణయం బీసీసీఐ దేనని భారత కోచ్ అమోల్ ముజుందార్ కూడా చెప్పారు.
ఇప్పుడు ఆసియా క్రీడల్లో మళ్లీ భారత్ పాక్ ఫైనల్ వచ్చింది. దీంతో భారత్ గెలిస్తే గోల్డ్ మెడల్ తీసుకునే సమయంలో మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే నఖ్వీ మాత్రం ఈసారి జపాన్‌కు వెళ్లడం లేదు. ముందుగానే నిర్ణయించిన ఇతర కార్యక్రమాలు ఉండటంతో ఆయన ఫైనల్‌కు హాజరుకావడం లేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. భారత్ vs పాక్ మ్యాచ్ కారణంగానే ఆయన దూరంగా ఉంటున్నారని మాత్రం అధికారికంగా చెప్పలేదు.
మ్యాచ్ విషయానికి వస్తే భారత్ సెమీఫైనల్లో శ్రీలంకను 124 పరుగుల తేడాతో ఓడించింది. మరోవైపు పాకిస్థాన్ బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు వచ్చింది. ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ గోల్డ్ కోసం తలపడటం ఇదే తొలిసారి. మ్యాచ్ పూర్తిగా వర్షంతో రద్దయితే రెండు జట్లకూ గోల్డ్ మెడల్ ఇవ్వనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
