మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను కదిలించేస్తోంది. మహారాష్ట్రలోని శంబాజీ నగర్‌కు చెందిన భార్యాభర్తలు మురళీధర్, సంగీత.. వారి కొడుకు కునాల్ అందరూ చూస్తుండగా ఒక కొండ మీది నుంచి పడి మరణించారు. ముందుగా తండ్రీ కొడుకులు, తర్వాత తల్లి నిమిషాల వ్యవధిలో కొండ మీది నుంచి పడిపోయి మరణించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ముగ్గురి ప్రాణాలు పోవడానికి ఐఫోన్ కారణమంటూ ఒక ప్రచారం జరుగుతోంది. తన తండ్రి ఐఫోన్ కొనివ్వకపోవడం వల్లే కునాల్ కొండ మీదికి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని.. మూడు గంటల పాటు తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని.. పదుల సంఖ్యలో జనాలు, పోలీసులు ఉన్నా ఏమీ చేయలేకపోయారని అంటున్నారు.
దగ్గరికొస్తే దూకేస్తా అంటూ బెదిరిస్తున్న కొడుకును పక్కకు లాగేయడానికి తండ్రి సమీపానికి వెళ్లగా.. అతను దూకేయడం, కొడుకును పట్టుకోబోయిన తండ్రి కూడా కిందపడిపోవడం.. భర్త, కొడుకు మరణాన్ని చూసి తట్టుకోలేక వెంటనే భార్య కూడా కిందికి దూకేయడం.. ఇలా నిమిషాల్లో పెను విషాదం చోటు చేసుకుంది.
ఐతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఈ గొడవకు అసలు కారణం ఐఫోన్ కాదని తెలుస్తోంది. ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందు కుర్రాడి తల్లి ఒక వీడియోలో విశ్వాసం లేని వ్యక్తులకు ప్రేమను చూపించడం వృథా అంటూ మాట్లాడగా.. అంతకుముందు కూడా అసంతృప్తితో మాట్లాడిన వీడియోలు కూడా బయటికి వచ్చాయి. అలాగే తల్లితో కునాల్ ఎంతో ఆత్మీయంగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
తన తండ్రి తల్లిని నిర్లక్ష్యం చేయడంతో కునాల్ తీవ్ర మనో వేదనకు గురయ్యాడని.. ఆయనకు వేరే మహిళతో సంబంధం ఉండడం, లేదా భార్యాభర్తల మధ్య ఇంకేదైనా సమస్య ఉండడం లాంటిది సమస్యకు ప్రధాన కారణం అయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. కొడుకుకు నచ్చజెప్పే ప్రయత్నంలో తాను తాళి కూడా తీసేస్తానని, భర్తను వదిలేసి నీతోనే ఉండిపోతానని తల్లి బతిమాలుతున్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. దీన్ని బట్టి ఐఫోన్ అన్నది టాపిక్కే కాదని.. కుటుంబ గొడవలతో తల్లడిల్లిన కునాల్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని, కానీ అనుకోకుండా ముగ్గురి ప్రాణాలూ పోయాయని అర్థమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates