ఫ్రీగా టీకాలు 3 కోట్ల మందికే అయితే.. మిగిలినోళ్ల మాటేంది?

కంటికి కనిపించని మహ్మమారి కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ దేశంలోమరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. తొలిదశలో ఆరోగ్య కార్యకర్తలు..ఆరోగ్య సిబ్బందికి ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోడీ వ్యాక్సిన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిదశలో దేశ వ్యాప్తంగా మూడు కోట్ల మందికి టీకాలు ఇస్తున్నామని.. అదంతా ఉచితమని పేర్కొన్నారు.

రానున్న కొన్ని నెలల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 30 కోట్ల మందికి టీకాలు ఇవ్వటమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని మోడీ.. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం సన్నద్ధత.. రాష్ట్రాలతో సమన్వయం అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి భారత్ చేపట్టే టీకా కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రోగ్రాంగా అభివర్ణించారు. ప్రభుత్వ.. ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న వైద్యులు.. వైద్య సిబ్బంది.. ఆరోగ్య కార్యకర్తలకే తొలిదశలో టీకా వేస్తామన్నారు.

అనంతరం ఫ్రంట్ లైన్ వర్కుర్లుగా సేవలు అందించే పారిశుద్ధ్య కార్మికులు.. భద్రతా దళాలు.. పోలీసులు.. పారా మిలటరీ దళాలు.. హోంగార్డులు.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ వలంటీర్లకు తొలిదశలో టీకాలు ఇవ్వనున్నారు.రెండో విడత టీకాలు వేసే సమయానికి మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. టీకాల పని తీరుపై శాస్త్రీయ నిర్దారణకు వచ్చిన తర్వాతే వ్యాక్సినేషన్ కార్యక్రమంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. టీకాల్ని ఉచితంగా మూడు కోట్ల మందికే ఇస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రధాని మోడీ మాటల్ని చూస్తుంటే.. మొదటిదశలో టీకా అందించే మూడు కోట్ల మందికే ఉచితంగా ఇవ్వొచ్చని.. మిగిలిన వారి నుంచి పాక్షికంగా డబ్బులువసూలు చేసే కార్యక్రమాన్ని షురూచేయొచ్చన్న మాట వినిపిస్తోంది. అయితే.. కేంద్రం డబ్బులు వసూలు చేసే ప్రోగ్రాం మొదలు పెట్టినా.. కొన్ని రాష్ట్రాలు ఆ ఖర్చును తాము భరించి ప్రజలకు ఫ్రీగా టీకాల్ని అందించే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)