నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పునర్జన్మ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఐతే ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినైతే ఇవ్వలేదన్నది వాస్తవం.
ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే శ్యామ్ సింగరాయ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ చాలా బాగుంటాయి. పునర్జన్మ కాన్సెప్ట్, క్లైమాక్స్ అన్నీ బాగుంటాయి కానీ.. వర్తమానంలో నాని యంగ్ క్యారెక్టర్ నేపథ్యంలో నడిచే సన్నివేశాలు మాత్రం చాలా సాధారణంగా ఉంటాయి. కృతి శెట్టితో నాని లవ్ ట్రాక్, రొమాన్స్ విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్ అయ్యేసరికి సినిమా మీద నెగెటివ్ ఒపీనియన్ కలుగుతుంది కానీ.. సెకండాఫ్‌లో సినిమా లెవెలే మారిపోతుంది.
ఐతే శ్యామ్ సింగరాయ్ ఫస్టాఫ్ విషయంలో ప్రేక్షకుల అభిప్రాయంతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కూడా ఏకీభవించాడు. ఆ సినిమాలో ప్రథమార్ధం తనకు కూడా నచ్చలేదంటూ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు రాహుల్. ఆ సినిమా తీస్తున్నపుడే ఫస్టాఫ్ విషయంలో అసంతృప్తి ఉండేదని అతను చెప్పాడు. ఇక సెకండాఫ్ గురించి మాట్లాడుతూ.. అది అంత బాగా వస్తుందని తాను కూడా ఊహించలేదన్నాడు.
అప్పటికి తనకు అనుభవం లేకపోవడంతో పీరియడ్ ఫిలింని సరిగా డీల్ చేయగలనా.. అది బాగా వస్తుందా అనే సందేహాలు కలిగాయని.. టీంలో కూడా చాలామందికి డౌట్లు ఉండేవని.. చివరికి చూస్తే ఔట్ పుట్ చూసి అందరం ఆశ్చర్యపోయామని రాహుల్ తెలిపాడు. ఆ పార్ట్ బాగా తీయడంతో కాన్ఫిడెన్స్ వచ్చి ఇప్పుడు రణబాలి రూపంలో ఫుల్ లెంగ్త్ పీరియడ్ ఫిలిం తీసినట్లు రాహుల్ తెలిపాడు. ఈ సినిమా ఫలితం మీద అతను ధీమా వ్యక్తం చేశాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రణబాలి దసరా కానుకగా అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates