కొత్త కుబేరుడొచ్చాడు.. సంపద ఎంతో తెలుసా?


ప్రపంచానికి కొత్త కుబేరుడొచ్చాడు. ఇప్పటిదాకా అమేజాన్ వ్యవస్థాపకుడు జాక్ బిజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతుండగా.. ఇప్పుడు ఆయన స్థానంలోకి ఎలాన్ మస్క్ వచ్చాడు. ఒక్క రోజులో ఆయన సంపద అమాంతం పెరిగింది. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత అయిన ఎలాన్ మస్క్‌కు గురువారం షేర్ మార్కెట్ గొప్పగా కలిసొచ్చింది. ఒకేసారి ఆయన నేతృత్వంలోని ఎలక్ట్రానిక్ కార్ కంపెనీ టెస్లా షేర్ విలువ 4.8 శాతం పెరిగింది. మస్క్ మొత్తం సంపద ఏకంగా 188.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఈ మొత్తం రూపాయల్లో అక్షరాలా 13.85 లక్షల కోట్లు కావడం విశేషం. గురువారం పెరిగిన షేర్ల విలువతో బిజోస్ కంటే మస్క్ సంపద 1.5 బిలియన్ డాలర్లు (రూ.11 వేల కోట్లు) ఎక్కువ అయింది. దీంతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా అవతరించాడు.

బిజోయ్ 2017 అక్టోబరు నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు. అప్పట్నుంచి ఆయనకు ఎదురు లేదు. ఐతే గత ఏడాది కాలంలో మస్క్ సంపద అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడే ఏకంగా బిజోస్‌ను అధిగమించి ప్రపంచ కొత్త కుబేరుడిగా అవతరించాడు. గత 12 నెలల్లో మస్క్ సంపద 150 బిలియన్లు (రూ.1.1 లక్షల కోట్లు) పెరగడం విశేషం.

ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలోనే ఏ కుబేరుడూ ఏడాది వ్యవధిలో ఇంత సంపదను ఆర్జించలేదు. ఆయన కంపెనీ టెస్లా షేర్ విలువ ఏకంగా 743 శాతం పెరగడం విశేషం. 49 ఏళ్ల ఎలాన్ మస్క్.. దక్షిణాఫ్రికాలో పుట్టి అమెరికాలో పారిశ్రామిక వేత్తగా ఎదిగాడు.