కంగనా సినిమా… 250 కోట్లు కట్టమంటున్నారు

బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్‌కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా ఇమేజ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి. ఈ మధ్యే ‘భారత భాగ్య విదాత’ అని ఓ మంచి సినిమా చేస్తే పట్టుమని పది కోట్ల వసూళ్లు కూడా రాలేదు. గత కొన్నేళ్లలో కంగనా నటించిన సినిమాలన్నింటి పరిస్థితీ ఇదే. ఐతే చాన్నాళ్ల తర్వాత ఆమె నుంచి ఒక ప్రామిసింగ్ మూవీ రాబోతోంది. అదే.. క్వీన్-2. 

కంగనా కెరీర్‌ను మలుపు తిప్పి, ఆమెను పెద్ద స్టార్‌ను చేసిన ‘క్వీన్’ మూవీకి ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజే ఉంది. ‘క్వీన్’ తీసిన వికాస్ బల్‌యే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. జియో స్టూడియోస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘క్వీన్-2’కు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది.

ఈ చిత్ర నిర్మాతల మీద రూ.250 కోట్లకు దావా వేసింది ఫాంటమ్ ఫిలిమ్స్ సంస్థ. ‘క్వీన్’ మూవీని ప్రొడ్యూస్ చేసింది ఆ ప్రొడక్షన్ హౌసే. సీక్వెల్ కథకు సంబంధించి క్రియేటివ్ రైట్స్ తమ దగ్గరే ఉన్నాయని, తమ అనుమతి లేకుండా సినిమా తీసినందుకు తమకు రూ.250 కోట్లు కట్టాలని జియో స్టూడియోస్‌కు నోటీస్ పంపించింది ఫాంటమ్ సంస్థ. ఈ సినిమా ప్రొడక్షన్ రైట్స్ విషయంలో ఫాంటమ్, జియో స్టూడియోస్ మధ్య కొన్ని నెలల ముందు నుంచే చర్చలు జరుగుతున్నా.. అవి ఒక కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు ఫాంటమ్ సంస్థ కోర్టుకు ఎక్కింది. 

ఐతే ‘క్వీన్-2’కు క్రేజ్ ఉన్నప్పటికీ, కంగనా మార్కెట్ ఇప్పుడు బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో ‘క్వీన్’ తరహాలో ‘క్వీన్-2’ వంద కోట్ల వసూళ్లు అయినా కలెక్ట్ చేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. అలాంటిది ఏకంగా రూ.250 కోట్ల నష్ట పరిహారం కోరుతూ ఫాంటమ్ సంస్థ కోర్టుకెక్కడం మరీ విడ్డూరంగా అనిపిస్తోంది. మరి ఈ వివాదాన్ని జియో స్టూడియోస్ ఎలా పరిష్కరించుకుని ‘క్వీన్-2’ను సజావుగా రిలీజ్ చేస్తుందో చూడాలి.