శోకంలోనూ విమర్శలు తప్పలేదు

అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఎలాగోలా నెట్టుకు రావచ్చు గానీ… తోడబుట్టిన సోదరుడు చనిపోయిన శోకంలో మునిగిన సమయంలో కూడా అక్తర్ పై విమర్శల జడివాడ కురుస్తోంది. ఒకప్పుడు ప్రశంసలతో ముంచెత్తిన వారే ఇప్పుడు అక్తర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు తమకు గర్వకారణమని చెప్పిన వారే ఇప్పుడు అతడిని ఓ దేశ ద్రోహిగా చిత్రీకరిస్తున్న వైనం కనిపిస్తోంది.

పాక్ క్రికెట్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్పీడుతో బౌలింగ్ చేయగలిగిన బౌలర్ గా షోయబ్ అక్తర్ కు మంచి పేరు ఉంది. ఈ కారణంగానే అతడిని అంతా రావల్పిండి ఎక్స్ ప్రెస్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అలాంటి అక్తర్ పై ఇప్పుడు అతడి దేశంలోనే వరుసబెట్టి విమర్శలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తన సోదరుడు షాహిద్ అక్తర్ మరణంతో షోయబ్ విషాదంలో మునిగిపోయాడు. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న షోయబ్ పై ఇప్పుడు మరింత పెద్ద ఎత్తున విమర్శలు రేగుతున్నాయి.

షాహిద్ అలత్యక్రియల్లో పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరీ పాలుపంచుకోవడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశంగా గుర్తిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో షోయబ్ సోదరుడి అంత్యక్రియల్లో సైఫుల్లా పాలుపంచుకొనడం, ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోల్లో సైఫుల్లా స్పష్టంగా కనిపిస్తున్న తీరుతో ప్రపంచ దేశాల అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ దిశగా దేశానికి మరింతగా చెడ్డపేరు తెచ్చే దిశగా షోయబ్ వ్యవహరిస్తున్నారంటూ పాక్ లో విమర్శలు వినిపిస్తున్నాయి.

ఓ క్రికెటర్ గా షోయబ్ పాక్ కు ఓ ఆణిముత్యమేనని చెప్పాలి. షోయబ్ ప్రతిభ ద్వారా పాక్ కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. క్రికెట్ వీడిన తర్వాత షోయబ్ వరుసగా విమర్శల్లో చిక్కుకుపోతున్నాడు. ఇటీవలే టీమిండియా జట్టు ఆటతీరును, క్రీడా స్ఫూర్తిని కీర్తిస్తూ షోయబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పాక్ కు బద్ధ వైరిగా ఉన్న టీమిండియాను ఎలా పొగడుతారంటూ పాకిస్తానీలు షోయబ్ పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా తన సోదరుడి అంత్యక్రియల్లో సైఫుల్లా పాలుపంచుకోవడంతో షోయబ్ మరోమారు విమర్శలకు గురయ్యాడు.