సురేష్ రైనా వస్తానంటే.. చెన్నై వద్దంటోందా?

ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ మోస్ట్ పాపులర్ క్రికెటర్ అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. ఈ లీగ్ చరిత్రలో ధోనికి వచ్చినంత గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవ్వరికీ రాలేదన్నా అతిశయోక్తి కాదు. నిషేధం పడ్డ రెండేళ్లు మినహాయిస్తే ఐపీఎల్ ఆరంభం నుంచి ఆటగాడిగా ఆ జట్టుతోనే సాగిన ధోని.. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై సీఎస్కేకు అతను మెంటార్‌గా వ్యవహరించబోతున్నాడు.

ఐతే ధోని తర్వాత ఈ జట్టులో అంత పాపులర్ అయిన ఆటగాడు సురేష్ రైనా మాత్రం ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. అతను కూడా ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నైతోనే సాగిన వాడే. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఘనత కూడా రైనా సొంతం. సీఎస్కేలో రైనా ఉండగా.. అతణ్ని ‘చిన్న తల’ అనే వాళ్లు అభిమానులు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువేమీ కాదు. కానీ కొవిడ్ టైంలో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ సందర్భంగా ఏదో వివాదం తలెత్తి అతను అర్ధంతరంగా లీగ్‌ను వదిలి వచ్చేశాడు. ఆ తర్వాత చెన్నై జట్టు అతణ్ని వదిలిపెట్టేసింది.

ఐతే ఆటగాడిగా కెరీర్ ముగిశాక ఐపీఎల్ జట్లకు కోచింగ్ స్టాఫ్‌గా రావడం మామూలే. రైనా స్థాయి ఆటగాడికి పెద్ద పోస్టే ఇచ్చి ఫ్రాంఛైజీలో కొనసాగించవచ్చు. కానీ సీఎస్కేనే కాదు.. మరే జట్టూ ఆ పని చేయలేదు. నిజానికి రైనాకు చెన్నై జట్టులోకి రావాలని, బ్యాటింగ్ కోచ్ పదవి చేపట్టాలని చాలా ఆశ ఉందట. అతను ఆ దిశగా ప్రయత్నం కూడా చేస్తున్నాడట. కానీ సీఎస్కే యాజమాన్యం అతడికి ఆ అవకాశం ఇవ్వట్లేదట. ఈ విషయాన్ని సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

సీఎస్కే కోచింగ్ బృందంలోకి రావాలని రైనా ఎంత ప్రయత్నిస్తున్నా, యాజమాన్యం మాత్రం అంగీకరించడం లేదని.. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని రాయుడు అన్నాడు. అన్నేళ్లు చెన్నైకి ఆడి, అభిమానుల ఆదరణ సంపాదించుకున్న రైనాకు ఒక అవకాశం ఇస్తే తప్పేముందని రాయుడు ప్రశ్నించాడు. ఇక గత కొన్ని సీజన్ల నుంచి చెన్నై విఫలమవుతుండడం గురించి రాయుడు స్పందించాడు. సీఎస్కే ఎప్పుడూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లను నమ్ముకుని ప్రయాణం సాగిస్తూ వచ్చిన జట్టని, ఐపీఎల్‌ జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరిగాక సీనియర్ ఆటగాళ్లు ఎక్కువమంది దొరకట్లేదని, అందుకే చెన్నై యువ ఆటగాళ్లతో ముందులా విజయం సాధించలేకపోతోందని, మారుతున్న కాలానికి తగ్గట్లు వ్యూహాలు మారకపోవడమే ఆ జట్టు వైఫల్యానికి కారణమని రాయుడు అభిప్రాయపడ్డాడు.