తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది. వెరసి దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్తులు నిర్దేశిత సమయానికి పరీక్షా కేంద్రానికి కాలేదన్న కారణంలో పరీక్ష రాయలేకపోయారు. ఈ సందర్బంగా చాలా ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలు అందరినీ షాక్ కు గురి చేశాయి. తమ పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు భద్రతా సిబ్బంది కాళ్లావేళ్లా పడిన తీరు నిజంగానే పలువురిని కంట తడిపెట్టించింది.
కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పిదం కారణంగా ఈ ఏడాది వైద్య విద్యను ఆశిస్తున్న విద్యార్థులు రెండు పర్యాయాలు నీట్ పరీక్షను రాయాల్సి వచ్చింది. తొలిసారి ఈ పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ… ప్రశ్నాపత్రాన్ని లీక్ కాకుండా అడ్డుకోలేకపోయింది. తాను చేసిన తప్పునకు విద్యార్థులకు మరోమారు పరీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ అభ్యర్థులు రెండో దఫా పరీక్షను రాయాల్సి వచ్చింది. ఈ దఫా ఎక్కడికక్కడ పకడ్బందీగానే ఏర్పాట్లు చేసిన ఎన్టీఏ… పరీక్షను నిర్వహించింది.
ఎన్టీఏ నిర్వహించే నీట్ అయినా, జేఈఈ అయినా… పరీక్షా కేంద్రానికి నిర్దేశిత సమయానికంటే ముందుగానే రావాలని ఆ సంస్థ ఓ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని కూడా ఆ సంస్థ తెగేసి చెబుతున్న తీరు తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నాటి నీట్ పరీక్షకు పలువురు విద్యార్థులు… ఒకటి, రెండు నిమిషాల మేర ఆలస్యంగా వచ్చారు. వీరిని పరీక్షా కేంద్రంలోని అనుమతించేందుకు అక్కడి భద్రతా సిబ్బంది ససేమిరా అనడం గమనార్హం. ఈ తరహా ఘటనలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కనిపించాయి.
మేడ్చల్ జిల్లా కీసరలోని ఓ పరీక్షా కేంద్రానికి ఒక్కటంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థినిని భద్రతా అదికారులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సదరు విద్యార్థిని తండ్రి సిబ్బంది పాదాలపై పడ్డా ప్రయోజనం లేకపోయింది. పరీక్షా కేంద్రానికి సంబందించిన గూగుల్ మ్యాప్ పొరపాటు వల్లే తన కూతురు ఆలస్యంగా వచ్చిందని ఆ తండ్రి సిబ్బందిని వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆయన సిబ్బంది పాదాలపై పడ్డారు. అయినా ఫలితం లేకపోయింది.
ఇక జగిత్యాలలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. తన బిడ్డ భవిష్యత్తు కోసం ఓ తల్లి భద్రతా సిబ్బంది కాళ్లపై పడ్డారు. అయినా కూడా భద్రతా సిబ్బంది గానీ, ఎన్టీఏ సిబ్బంది గానీ కనికరం చూపలేదు. ఇక హైదరాబాద్ పరిధిలోని జేఎన్టీయూలోనూ ఇద్దరు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రాగా… వారిని సిబ్బంది గేటు వద్దే నిలిపివేశారు. దీంతో వారు కన్నీరు పెట్టుకుంటూ వెనక్కెళ్లిపోయారు. మొత్తంగా తాను చేసిన తప్పునకు రెండో సారి పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏ… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులను కూడా క్షమించలేకపోయిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates