సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. “మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే.. అన్యాయం జరిగితే నిలదీస్తాం, నిరసన తెలుపుతాం” అంటోంది నేటి యువత. మన దేశంలో వచ్చిన కాక్రోచ్ ఉద్యమం ఇందుకు ఉదాహరణ.

జెన్-జెడ్ యువత పలు దేశాల్లో ఇటువంటి వినూత్న పద్ధతుల్లోనే తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లో తాజాగా ముఖ్యమంత్రి నివాసం ముందే చెత్త పారబోసి యువత నిరసన తెలిపింది. మెరుగైన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రమైన వీధులు కావాలని యువకులు తమ డిమాండ్‌ను వినిపిస్తున్నారు.

నేపాల్‌లోని జనక్‌పూర్‌లో యువకుల బృందం వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. మెరుగైన చెత్త నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వీధులను పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నివాసంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట చెత్తను పారబోసి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రాంతాల్లో చెత్త సేకరణ, పారవేత సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపించిన నిరసనకారులు, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ వినూత్న నిరసన స్థానిక ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా నిలిచింది. చెత్త నిర్వహణలో లోపాలు, సరైన మౌలిక సదుపాయాల కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 2025 సెప్టెంబరులో ప్రభుత్వం వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ సహా ప్రధాన సోషల్ మీడియా వేదికలపై నిషేధం విధించడంతో యువతలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. ముఖ్యంగా జెన్-జెడ్ యువత ముందుండి ఉద్యమాన్ని నడిపించడం విశేషంగా నిలిచింది.