గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి చేసినట్లు అవుతుందా? దాంపత్య జీవితంలో గొడవలు చోటు చేసుకున్నప్పుడు..మాటా మాటా పెరిగి మాటలు బంద్ అయిన వేళ.. గృహ హింస కేసు పెడితే..దానికి న్యాయస్థానం శిక్ష విధిస్తే..? అచ్చంగా ఇలానే జరిగిన ఉదంతానికి సంబంధించి సదరు భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజాగా దీనికి సంబంధించిన తీర్పును ఇవ్వటమే కాదు.. కింద కోర్టు వేసిన శిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
చిన్న మనస్పర్థల కారణంగా వచ్చే గొడవలతో మాట్లాడకపోవటం సర్వ సాధారణమని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అదే సమయంలో బలమైన సాక్ష్యాలు లేకుండా వేధింపులు..గృహ హింస.. వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేయటం సరికాదంది.
కేరళకు చెందిన దంపతుల వివాదానికి సంబంధించిన కేసుకు సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే.. ఈ కేసు వివరాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి. బ్యాడ్ లక్ ఏమంటే.. గొడవలతో భర్త మాట్లాడకపోవటం.. ఆ తర్వాతి కాలంలో ఆమె ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవటం చూసినప్పుడు.. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలతో జరిగే నష్టమెంతన్న విషయం తాజా కేసులో తెలుస్తుంది.
కేరళకు చెందిన జయేష్ కన్నా ఒక ప్రైవేటు ఉద్యోగి. ఒమన్ లోని మస్కట్ లో జాబ్ చేస్తుంటాడు. అతడికి 2014లో సంగీత అనే మహిళతో పెళ్లైంది. వివాహం జరిగిన నాలుగు వారాలకే అతను తిరిగి ఒమన్ కు వెళ్లిపోయాడు. అత్తారింట్లో కొద్దిరోజులు ఉన్న సంగీత.. ఆ తర్వాత పుట్టింటికి వెళ్లారు. భర్త నుంచి తనకు ఫోన్ చేసే సందర్భంలో సరిగా మాట్లాడని.. కొద్దిరోజులు ఫోన్ చేయలేదన్న ఫిర్యాదు ఉండేది.
ఇదిలా ఉండగా మానసిక ఒత్తిడి.. ఆవేదనతో 2015 జనవరి 31న ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో సంగీత తల్లిదండ్రులు అల్లుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవటానికి పదమూడు రోజుల పాటు ఆమెతో మాట్లాడలేదని.. కోపం కారణంగా ఇలా చేసినట్లుగా కోర్టుకు తెలిపారు. ఈ మానసిక క్షోభతోనే సంగీత ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఆరోపించారు.
జయేష్ కుటుంబ సభ్యులపై వచ్చిన వరకట్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేలినప్పటికి.. భార్యతో 13 రోజులు మాట్లాడని కారణంగా ట్రయల్ కోర్టు అతడికి ఐపీసీ 498ఏ కింద మూడేళ్లు జైలు విధించింది. దీన్ని సవాలు చేస్తూ జయేష్ ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై కింది కోర్టు తీర్పును మద్రాస్ హైకోర్టు సమర్థించింది. అదే సమయంలో అధికారులు జయేష్ విదేశాలకు వెళ్లకుండా పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో జయేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పును ఇచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న జయేష్ నిర్దోషిగా పేర్కొంది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు.. అలకల వేళ కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉండొచ్చని.. అంత మాత్రాన తగిన ఆధారాలు లేకుండా.. కేవలం 13 రోజులు మాట్లాడనంత మాత్రాన క్రిమినల్ చట్టాల పరిధిలోని క్రూరత్వంగా భావించలేమని స్పష్టం చేశారు.
అంతేకాదు.. దంపతుల మధ్య వాట్సప్ మెసేజ్ లు లేకపోవటాన్ని భార్య తరఫు వారు సాక్ష్యంగా చూపిన వైనాన్ని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాట్సప్ లో మెసేజ్ లు పంపకుంటే.. సాధారణ ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుకొని ఉండొచ్చు కదా? అని ప్రశ్నించింది. భార్యాభర్తల మధ్య జరిగే సాధారణ గొడవల వేళ.. తాత్కాలిక మౌనాన్ని చట్టప్రకారంగా క్రిమినల్ క్రూరత్వంగా మార్చలేమని సుప్రీం స్పష్టం చేసింది.
ఈ వాదనల వేళ.. తాను తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించానని.. కానీ ఆమె ఫోన్ పని చేయకపోవటంతో ఆమె తండ్రికి ఫోన్ చేసిన వైనాన్ని జయేష్ కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం జయేష్ కు కింది కోర్టులు విధించిన జైలుశిక్షను పూర్తిగా రద్దు చేసిన సుప్రీం.. ఈ కేసు నుంచి ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది.
అంతేకాదు.. అధికారులు స్వాధీనం చేసుకున్న పాస్ పోర్టును తక్షణం తిరిగి ఇచ్చేయాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. 2015లో భార్య ఆత్మహత్య చేసుకున్నా.. తొమ్మిదేళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర మానసిక వేదనను అనుభవించినట్లుగా పేర్కొన్నారు. ఈ కేసు కారణంగా ఒమన్ లో తాను చేస్తున్న జాబ్ ను వదులుకోవాల్సి వచ్చిందని.. చివరకు సుప్రీం తనను నిర్దోషిగా ప్రకటించటంతో తన కష్టాలు తీరుతాయని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
