పాప రాలేదు.. కుక్క ఇక లేదు.. ఏపీకి స‌వాల్‌గా కేసు!

ఏపీ ప్ర‌భుత్వానికి.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పోలీసుల‌కు కూడా ఓ కేసు స‌వాల్‌గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. స‌ద‌రు బాలిక జాడ క‌నిపెడుతుంద‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పెంపుడు(వీధి) కుక్క కూడా చ‌నిపోయింది. దీంతో ఇప్పుడు ఆ బాలిక ఆచూకీ ఎలా క‌నిపెట్టాల‌న్న విష‌యం ఇటు స‌ర్కారుకు కూడా ఇబ్బందిగానే ఉంది. మ‌రోవైపు బాల‌ల హ‌క్కుల సంఘాలు.. వైసీపీ నాయ‌కులు స‌ర్కారుపై విమ‌ర్శ‌ల జోరు పెంచుతున్నారు.

వారం కింద‌ట‌..

ఉమ్మడి తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని తుని మండ‌లంలో ఉన్న దొండ‌వాక పంచాయ‌తీలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి 2 ఏళ్ల పాప జ్ఞానేశ్వ‌రి ఉంది. అయితే.. గ‌త శ‌నివారం(జూన్ 6) రోజు.. ఇంటి చుట్టుప‌క్క‌ల తిరిగే ఓ కుక్క‌తో ఆడుకుంటూ.. ఆ పాప‌.. ఎక్క‌డికో వెళ్లింది. కానీ.. తిరిగిరాలేదు. రెండు రోజులు వేచి చూసిన తల్లిదండ్రులు.. ఊరూవాడా గాలించారు. అయినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

చిత్రం ఏంటంటే.. స‌ద‌రు చిన్నారితో వెళ్లిన కుక్క తిరిగి వ‌చ్చింది. కానీ.. పాప మాత్రం రాలేదు. దీంతో మ‌రింత గాబ‌రా పెరిగింది. ఈ నేప‌థ్యంలో అతి క‌ష్టం మీద‌.. స‌ద‌రు కుక్క‌ను వినియోగించి.. ఎలాగైనా బాలిక‌ను గుర్తించాల‌ని పోలీసులు భావించారు. వాస్త‌వానికి.. దీనికి ముందు భారీ ఎత్తున ప్ర‌ణాళిక ర‌చించి .. బాలిక కోసం.. సీసీ టీవీ ఫుటేజీని.. ఇత‌ర‌త్రా ఆధారాలను వినియోగించి బాలిక‌ను గుర్తించాల‌ని భావించారు. కానీ.. సాధ్యం కాలేదు. దీంతో పూర్తిగా కుక్క‌పైనే పోలీసులు.. అధికారులు.. ఆధార‌ప‌డ్డారు.

సాధార‌ణంగా కుక్క‌లు ఒక ప్రాంతంలో తిరిగి.. మ‌ళ్లీ అదే ప్రాంతానికి వెళ్తుంటాయి. కుక్క‌తో వెళ్లిన చిన్నారి తిరిగి రాలేదు కాబ‌ట్టి.. శున‌కం తిరిగి ఆ దిశ‌గా వెళ్తుంద‌ని అంచ‌నా వేశారు. దీనికి జీపీఎస్ స‌హా.. ఇత‌ర ప‌రిక‌రాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా కుక్క ఎక్క‌డెక్క‌డ తిరుగుతోంది? బాలిక ఆచూకీ ఏమైనా తెలుస్తుందా? అనే ఉత్కంఠ వెంటాడింది. కానీ.. చివ‌ర‌కు శ‌నివారం సాయంత్రం స‌ద‌రు కుక్క అక‌స్మాత్తుగా మృతి చెందింది.

దీంతో బాలిక‌ను గుర్తించే కీల‌క.. ఆధారం కోల్పోయామ‌ని పోలీసులు చెబుతున్నారు. కాగా.. గ‌త శ‌నివారం నుంచి ఈ శ‌నివారం వ‌ర‌కు బాలిక ఆచూకీ ల‌భించ‌క‌పోవ‌డం.. ఉన్న ఒక్క ఆధారం కూడా మృతి చెంద డంతో ఇటు ప్ర‌భుత్వానికి.. అటు పోలీసుల‌కు కూడా బాలిక జ్ఞానేశ్వ‌రి కేసు స‌వాల్‌గా మారింది.