భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు, మూడేళ్ల క్రితం నగర శివారులోని కోకాపేటలో ప్రభుత్వ భూములను వేలం వేయగా.. ఎకరం ధర రూ.100 కోట్లు పలికిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే… తాజాగా ఆ ధర కాస్తా ఏకంగా రూ.237 కోట్లకు చేరి నిజంగానే జనానికి కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. కేవలం రెండేళ్ల వ్యవదిలోనే నగరంలోని భూముల ధర ఇలా రెండింతలు, మూడింతలు అయిపోతున్న తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
నగరంలోని గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గంలో టీజీఐఐసీకి కేటాయించిన భూములున్న సంగతి తెలిసిందే. ఈ భూముల్లోని సర్వే నెంబరు 83/1లో – 6 ఎకరాల 9 గుంటల భూమి ఉండగా… దానిని గురువారం వేలం వేశారు. ఈ వేలానికి ప్రభుత్వాన్నే షాక్ కు గురి చేసే స్పందన లభించింది. బిడ్డింగ్ లో పాలుపంచుకున్న గౌర వెంచర్స్ ఈ భూమిని దక్కించుకుంది. ఈ భూమి కోసం ఆ సంస్థ ఎకరానికి ఏకంగా రూ.237 కోట్లను కోట్ చేయడం గమనార్హం.
ఎకరం భూమి ఏకంగా రూ.237 కోట్లు పలకడంతో నగర చరిత్రలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో చరిత్రలో మరెన్నడూ లేని రీతిలో భారీ ధర లభించినట్టైంది. ఫలితంగా ఇప్పటిదాకా నమోదైన రికార్డులన్నీ కూడా ఈ వేలంతో బద్దలైపోయాయని చెప్పక తప్పదు. ఇదే ప్రాంతంలో గతంలో ప్రభుత్వమే భూములను వేలం చేయగా…ఎకరాకు రూ.177 కోట్ల ధర లభించింది. దానిని తలదన్నేలా ఇప్పుడు ఎకరాకు ఏకంగా రూ.237 కోట్ల ధర రావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates