ఇదేనా వార్నర్‌కు ఇచ్చే గౌరవం?

ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అత్యంత ఇష్టపడే విదేశీ క్రికెటర్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా అతను ఇండియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ మెగా క్రికెట్ లీగ్‌లో వార్నర్ వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడినపుడు తనకున్న ఫాలోయింగే వేరు. డెక్కన్ ఛార్జర్స్ స్థానంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీని చేపట్టిన సన్‌రైజర్స్ మొదట్లో కొన్నేళ్లు తీవ్రంగా తడబడింది.

జిడ్డు ఆటకు మారు పేరుగా ఉంటూ.. లోకల్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా.. ఐపీఎల్‌లో పెద్దగా ఆకర్షణ లేని జట్లలో ఒకటిగా కొనసాగింది సన్‌రైజర్స్. అలాంటి జట్టుకు లోకల్‌గానే కాక.. దేశవ్యాప్తంగా గొప్ప ఆదరణ తీసుకొచ్చిన ఘనత వార్నర్ సొంతం.

తన వ్యక్తిగత ఆటతో పాటు కెప్టెన్సీతోనూ అతను అభిమానుల మనసులు దోచాడు. అంతే కాక ఇండియన్ సినిమాల రెఫరెన్సులతో వీడియోలు చేయడం ద్వారానూ అభిమానులను ఆకట్టుకున్నాడు. 2016లో సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించడంతో తన పేరు మార్మోగింది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా వార్నర్ ఆ సమయంలో పేరు సంపాదించాడు.

ఐతే తమ జట్టుకు ఎంతో విలువ చేకూర్చి, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిన ఆటగాడి పట్ల తర్వాత సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ వ్యవహరించిన తీరు అభిమానులకు ఎంతమాత్రం నచ్చలేదు. కెప్టెన్సీ నుంచి తీసేయడం, తుది జట్టులో ఆడించకపోవడంతో చివరికి ఆ జట్టుకు టాటా చెప్పేశాడు వార్నర్. ఆ సమయంలో ఫ్యాన్స్ ఎంతో ఆవేదన చెందారు.

వార్నర్ లాంటి దిగ్గజాన్ని ఇలా అవమానిస్తారా అని సన్‌రైజర్స్ మీద యుద్ధం ప్రకటించారు ఒక దశలో. ఐతే వార్నర్ దీని గురించి ఎక్కువ పట్టించుకోకుండా దిల్లీ క్యాపిటల్స్‌కు మారిపోయాడు.

కొన్నేళ్లు అక్కడ ఆడాక.. వయసు మీద పడి, ఫామ్ తగ్గడంతో గత సీజన్ నుంచి మొత్తంగా ఐపీఎల్‌కే దూరం అయిపోయాడు. గత రెండు సీజన్ల నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ సహా అనేక విదేశీ లీగ్‌ల్లో కొనసాగుతున్నాడు. ఐతే తాజాగా వార్నర్ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ తన ఇండియన్ ఫ్యాన్స్‌కు ఆవేదన, ఆక్రోశం కలిగిస్తోంది.

సన్‌రైజర్స్ సోషల్ మీడియా అకౌంట్లలో వార్నర్‌ను బ్లాక్ చేసిన విషయాన్ని అతను వెల్లడించాడు. ఒకప్పుడు ఒంటి చేత్తో సన్‌రైజర్స్‌కు పాపులారిటీ తీసుకొచ్చిన ఆటగాడిని ఇలా బ్లాక్ చేయాల్సిన అవసరమేంటి.. ఏం చేశాడని అతడి మీద ఇంతగా కక్షగట్టారు అంటూ సన్‌రైజర్స్ మీద వార్నర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.