మాఫియా పాత్రల ప్రభావంతో తల్లి ప్రాణమే తీశాడు..

రాజాంలో జరిగిన స్పందన హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నవమాసాలు మోసి పెంచిన తల్లినే కన్నకొడుకు స్నేహితుడి సాయంతో హతమార్చడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

ఈ ఘటన కేవలం ఓ కుటుంబంలో విషాదం మాత్రమే కాదు.. ఆధునిక సాంకేతిక ప్రభావం, నియంత్రణలేని సెల్‌ఫోన్‌ వినియోగం, హింసాత్మక కంటెంట్‌ చిన్నారుల మనస్తత్వంపై ఎంతటి ప్రభావం చూపుతుందో చూపించిన ఉదంతంగా మారింది. జపాన్‌ యానిమేషన్‌లు, డాన్‌ చిత్రాలు, మాఫియా పాత్రల ప్రభావంతో ఇద్దరు బాలురు వాస్తవ జీవితాన్నే సినిమా కథలా భావించి నేరానికి పాల్పడడం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

పోలీసుల విచారణలో బయటపడిన వివరాలు మరింత షాకింగ్‌గా మారాయి. చదువులో మంచి మార్కులు సాధించిన బాలుడు క్రమంగా సెల్‌ఫోన్‌, సోషల్‌మీడియా ప్రభావానికి లోనయ్యాడు. చదువుపై దృష్టి పెట్టాలని, ఫోన్‌ వినియోగం తగ్గించాలని, క్రమశిక్షణ పాటించాలని తల్లి సూచించడాన్ని అతడు ఒత్తిడిగా భావించాడు.

ఓ అమ్మాయికి రాసిన లేఖ విషయం బయటపడటంతో తల్లి మందలించగా తీవ్ర అసహనం పెంచుకున్నాడు. ఇదే సమయంలో మాఫియా జీవితం పట్ల ఆకర్షణ కలిగిన మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ముందస్తు ప్రణాళికతో స్పందన ఇంట్లో దాక్కొని, ఆమె బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

అనంతరం బంగారం, నగదు తీసుకుని పలాస, విశాఖపట్నం, ముంబై ప్రాంతాలకు పారిపోయి పోలీసులను తప్పించుకునేందుకు సిమ్‌కార్డులు కూడా తొలగించడం వారి ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ ఘటన సమాజానికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు గట్టి హెచ్చరికగా నిలుస్తోంది. పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వడమే కాకుండా వారు ఏ కంటెంట్‌ చూస్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? సోషల్‌మీడియాలో ఎలా వ్యవహరిస్తున్నారు? వంటి అంశాలను ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

కేవలం మందలింపులు, ఆంక్షలు విధించడం కాకుండా పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం అత్యంత కీలకమని చెబుతున్నారు. చిన్న వయసులోనే హింసాత్మక ఆలోచనల పట్ల ఆకర్షితులవుతున్న యువతను సరైన దిశగా మలచడంలో కుటుంబం, పాఠశాలలు, సమాజం కలిసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.