తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ బాగానే ప్రభావం చూపిస్తాడని చాలామంది అన్నారు కానీ.. మరీ అధికారం చేపట్టే స్థాయిలో తన ప్రభావం ఉంటుందని ఊహించిన వాళ్లు తక్కువ. ఆయన విజయానికి కలిసి వచ్చిన కారణాల గురించి ఇప్పుడు అందరూ చర్చించడం మొదలుపెట్టారు. ఐతే విజయ్ మాత్రం ముందు నుంచి తన పార్టీ అధికారంలోకి రాగలదని బలంగా నమ్మాడు.
గత ఏడాది కరూర్ విషాదాంతం తర్వాత కొంత కాలం రాజకీయ సభలేవీ పెట్టకుండా సైలెంట్ అయిపోయిన విజయ్.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో ఆ ఘటన గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలను అప్పుడు ఎవరూ పెద్దగా పట్టంచుకోకపోయి ఉండొచ్చు కానీ.. ఇప్పుడు ఆ వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డీఎంకే పార్టీకే కాక స్టాలిన్‌కూ ఎన్నికల్లో ఓటమి తథ్యమని చెప్పిన విజయం.. అప్పుడు తనతో పెట్టుకున్నందుకు చింతిస్తాడంటూ విజయ్ వ్యాఖ్యానించడం విశేషం. ఇంతకీ ఆ రోజు విజయ్ ఏమన్నాడంటే..?
స్టాలిన్ సార్.. ఈ ఎన్నికలకు అనంతరం.. మీరు ఓడిపోయిన తర్వాత మీరు ఎలా ఫీలవుతారో ఈ రోజు కొంచెం చెప్పనా? ఎందుకురా ఈ విజయ్‌ని ఇబ్బంది పెట్టాం? ఎందుకురా ఈ విజయ్‌ని వేధించాం? ఎందుకురా ఈ విజయ్‌కు వ్యతిరేకంగా కుట్ర చేశాం? ఇలా తలుచుకుని తలుచుకుని బాధ పడతారు. ప్రజలే మీరు అలా ఫీలయ్యేలా చేస్తారు చూడండి.
నేను మీకు అంత చెడు ఏం చేశాను? మీరు తినే తిండిలో ఏమైనా మన్ను వేశానా? మీ పార్టీ తీరును.. మీరు, మీ మంత్రులు చేసే దోపిడీని ప్రజలకు తెలియజేశాను? ఇది చెప్పకుండా ఇంకేం చెబుతారు? కరూర్ విషయానికి వస్తాను. అక్కడ ఏం జరిగిందని ఆ ప్రాంత జనాలను అడిగితే జరిగింది జరిగినట్లు చెబుతారు. కానీ నింద నా మీద వేశారు.
మేం ఇలాంటి విషయాల్లో రాజకీయమే చేయను అని మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చి, అసెంబ్లీకి వెళ్లి నా మీదికి తప్పును తోసేశారు. నేను ఆలస్యంగా రావడం వల్లే ఇదంతా జరిగిందన్నారు. కానీ నేను పోలీసులు చెప్పిన టైంకే అక్కడికి వచ్చాను.
కానీ కరూర్‌కు రావడానికి ముందు దారి పొడవునా జనం ఉంటే వారిని పలకరించకుండా ఎలా అక్కడికి రాగలను. ఆ రోజు నేను కరూర్‌కు ఎలా వచ్చాను, అక్కడ ఏం జరిగింది అన్నది ప్రపంచమే లైవ్‌లో చూసింది. అయినా నింద నా మీదికి తోసేయాలని చూశారు. దీనికి ఫలితం అనుభవిస్తారు అని విజయ్ పేర్కొన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates