టెక్కీలకు నైట్‌మేర్‌గా మారుతున్న నవంబర్

Shot of a young businessman experiencing stress during a late night at work

నవంబర్ నెల టెక్ ప్రపంచానికి ఊహించని షాక్‌లను ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ సంస్థలు, బ్యాంకులు, విమానయాన సంస్థల డిజిటల్ సేవల్లో వరుసగా అంతరాయాలు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు సైబర్ దాడులు, మరోవైపు సాఫ్ట్‌వేర్ లోపాలు.. ఇలా ఏదో ఒక సమస్యతో కీలక సేవలు నిలిచిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా, దానిపై ఆధారపడిన వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం టెక్ రంగంలో నవంబర్‌ను ‘నైట్‌మేర్ నవంబర్’ గా అభివర్ణిస్తున్నారు.

ఈ నెలలో చోటుచేసుకున్న ప్రధాన ఘటనల్లో మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయం ఒకటి. నవంబర్ 12న మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఔట్‌లుక్ , టీమ్స్ , కోపైలట్ సేవలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయాయి. నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచే క్రమంలో కొన్ని సర్వర్లు పనిచేయడం ఆగిపోవడంతో మిగిలిన సర్వర్లపై ఒక్కసారిగా భారం పెరిగింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విమానయాన సేవలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సుమారు 36 గంటల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.

నవంబర్ 13న అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నెట్‌వర్క్‌లో ఏర్పడిన సమస్య విమానయాన రంగాన్ని కుదిపేసింది. కమ్యూనికేషన్ వ్యవస్థలో అంతరాయం కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. కొత్త రూటర్ నుంచి అధిక మొత్తంలో డేటా రావడంతో నెట్‌వర్క్‌పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా 10 వేలకుపైగా విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యంగా నడవడం జరిగింది. మరోవైపు నవంబర్ 16న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ లో సాంకేతిక సమస్య కారణంగా పైలట్లు ఉపయోగించే కొన్ని అప్లికేషన్లు పనిచేయలేదు. దీంతో పలు విమానాల బయలుదేరడంలో ఆలస్యం ఏర్పడింది.

ఇదే సమయంలో అమెరికాకు చెందిన అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన జేపీ మోర్గాన్ చేజ్ లో కూడా సాఫ్ట్‌వేర్ లోపం తలెత్తింది. వేలాది మంది ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేయలేకపోయారు. ఏటీఎం లావాదేవీలు, డిజిటల్ చెల్లింపుల్లో సమస్యలు ఎదురయ్యాయి. మరోవైపు వెబ్‌సైట్ టెస్టింగ్ కోసం ఉపయోగించే ఆప్టిమైజ్లీ ప్లాట్‌ఫామ్‌లోని భద్రతా లోపాన్ని ఆసరాగా చేసుకున్న హ్యాకర్లు 178 ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లలోకి మాల్‌వేర్‌ను చొప్పించారు. జూమ్ , బీబీసీ , సీఎన్ఎన్ , హెచ్‌ఎస్‌బీసీ వంటి సంస్థల వెబ్‌సైట్లు కూడా ఈ ప్రభావానికి గురయ్యాయి.

ఇక డచ్ షిప్పింగ్ సంస్థ మెర్స్క్ కు చెందిన సుమారు 100 జీబీ డేటాను దొంగిలించిన హ్యాకర్లు ఐదు మిలియన్ డాలర్ల బిట్‌కాయిన్‌ను డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాన్స్‌కు చెందిన పోస్టల్ సేవల అనుబంధ సంస్థ మైలెవా (Maileva)పై జరిగిన సైబర్ దాడిలో సుమారు 2.2 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం బయటపడింది.

ఈ వరుస ఘటనలు డిజిటల్ వ్యవస్థలు ఎంత ఆధునికంగా మారినా వాటి భద్రత, నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక సంస్థ సేవలు నిలిచిపోతే దానిపై ఆధారపడిన ఇతర సంస్థలు కూడా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. దీనినే డిజిటల్ వ్యవస్థల పరస్పర ఆధారితత్వం అంటారు. అందుకే సంస్థలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను జాగ్రత్తగా అమలు చేయడం, సైబర్ భద్రతను బలోపేతం చేయడం, ప్రత్యామ్నాయ వ్యవస్థలను సిద్ధంగా ఉంచుకోవడం అవసరం. వినియోగదారులు కూడా బలమైన పాస్‌వర్డ్‌లు, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటి భద్రతా చర్యలు పాటించాలి.

అన్నింటికంటే ముఖ్యంగా, సాంకేతికతపై పూర్తిగా ఆధారపడకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అందుబాటులో ఉంచుకోవాలి. డిజిటల్ చెల్లింపులతో పాటు కొంత నగదు దగ్గర ఉంచుకోవడం, ముఖ్యమైన సమాచారానికి బ్యాకప్ తీసుకోవడం వంటి చిన్న జాగ్రత్తలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. టెక్నాలజీ మనిషి జీవితాన్ని సులభతరం చేయాలి కానీ అదే సమయంలో కొత్త సమస్యలకు కారణం కాకూడదు. నవంబర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ టెక్ రంగానికి నేర్పిస్తున్న అసలైన గుణపాఠం ఇదే.