హార్ముజ్ ఓపెన్‌: ఊపిరి పీల్చుకున్న ప్ర‌పంచం!

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు.. త‌మ‌పై చేస్తున్న యుద్ధం నేప‌థ్యంలో కీల‌క‌మైన హోర్ముజ్ జల‌సంధిని ఇరాన్ మూసివేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ముడిచ‌మురు స‌ర‌ఫ‌రా, గ్యాస్ ర‌వాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్నిదేశాల్లో చ‌మురు నిల్వ‌లు అడుగంటి.. కార్య‌క‌లాపాల‌ను నిలిపేసుకున్నారు. మ‌రికొన్ని దేశాల్లో ప్ర‌భుత్వ ఆఫీసుల‌కు వేళ‌లు మార్చారు. ఇక‌, మ‌న దేశంలోనూ క‌ట్టెల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు, కిరోసిన్ పొయ్యిల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇలా.. తీవ్ర ప్ర‌భావం చూపిన హోర్ముజ్ జ‌ల‌సంధిని తాజాగా ఇరాన్ తెరిచింది.

కార‌ణ‌మేంటి?

అయితే.. ఇలా 40 రోజుల‌కుపైగానే తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయిన హోర్ముజ్ జ‌ల‌సంధిని తాజాగా శుక్ర‌వారం సాయంత్రం భార‌త కాల‌మానం ప్ర‌కారం.. 4 గంట‌ల స‌మ‌యంలో తెర‌వడానికి కీల‌క కార‌ణం.. లెబ‌నాన్‌. ఈ దేశంపై ఇటీవ‌ల ఇజ్రాయెల్ విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. లెబ‌నాన్.. ఇరాన్‌కు మిత్ర‌దేశం కావ‌డంతో ఆ దేశంపై ఇజ్రాయెల్ దాడుల‌ను నిలిపివేయాల‌ని డిమాండ్ చేసింది. అమెరికాతో త‌మ‌కు ఒప్పందం కుదిరినా.. కుద‌ర‌క‌పోయినా.. హోర్ముజ్ విష‌యంలో లెబ‌నాన్‌పై దాడులు ఆపితేనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఇరాన్ ప్ర‌క‌టించింది.

ఈ క్ర‌మంలో తాజాగా లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ దాడుల‌ను 10 రోజ‌లు పాటు నిలుపుద‌ల చేస్తూ..ఇరు దేశాల మ‌ధ్య ఓ అగ్రిమెంటు కుదిరింది. దీనిని లెబ‌నాన్ ధ్రువీక‌రించ‌డంతో తాజాగా ఇరాన్.. హోర్ముజ్ జ‌ల‌సంధిని తెరిచింది. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న మిత్ర దేశాల‌కు మాత్ర‌మే ఈ మార్గం గుండా అనుమ‌తులు ఇచ్చిన ఇరాన్‌.. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్టు పేర్కొంది. అయితే.. ఈఅనుమ‌తులు లెబ‌నాన్‌-ఇజ్రాయెల్ మ‌ధ్య కుదిరిన ఒప్పందానికి క‌ట్టుబ‌డి ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. దీనిని బ‌ట్టి 10 రోజుల పాటు హోర్ముజ్‌ను తెరిచి ఉంచ‌నున్నారు.

ఎంత కీల‌కం?

ఈ జ‌లసంధి.. ప్ర‌పంచ దేశాల‌కు అత్యంత కీల‌కం. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ముడిచ‌మురు ఉత్ప‌త్తి ఉన్నా.. అక్క‌డ ఖ‌రీదు ఎక్కువ‌. పైగా చుట్టూ తిరిగి రావాల్సిన ప‌రిస్థితి ఉంది. కానీ.. ప‌శ్చిమాసియాలోని గ‌ల్ఫ్ దేశాల్లో భారీగా చ‌మురు ఉత్ప‌త్తి ఉంటుంది. పైగా ఇక్క‌డ చ‌మురు ధ‌ర‌లు త‌క్కువ‌.. జ‌ల ర‌వాణా కూడా చౌక‌. దీంతో ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్‌(ప‌ర్షియా భాష మాట్లాడే దేశాల కూట‌మి)లో మ‌రింత ఎక్కువ‌గా ర‌వాణా జ‌రుగుతుంది. అందుకే హోర్ముజ్ జ‌ల‌సంధి అన్ని దేశాల‌కు కీల‌కం. ప్ర‌స్తుతం భార‌త్‌కు చెందిన 15 నౌక‌లు, 4500 మంది సిబ్బంది.. ఇక్క‌డ చిక్కుకుపోగా.. తాజాగా నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో వారంతా భార‌త్‌కు చేరుకుంటార‌ని విదేశాంగ శాఖ పేర్కొంది.