త్రివిక్రమ్ సినిమాలో దురంధర్ నటుడు?

చిన్న‌, పెద్ద అని తేడా లేకుండా దురంధ‌ర్, దురంధ‌ర్-2 చిత్రాల్లో న‌టించిన ప్ర‌తి ఆర్టిస్టూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఈ రెండు చిత్రాలు చూసిన వాళ్లు ఏ పాత్ర‌నూ.. వాటిని పోషించిన ఏ ఆర్టిస్టుల‌నూ అంత సులువుగా మ‌రిచిపోలేరు. దురంధ‌ర్-2లో క‌నిపించింది కాసేపే అయినా ఉద‌య్ వీర్ సంధు అనే యువ న‌టుడు బ‌ల‌మైన ఇంపాక్ట్ వేశాడు. పిందా అనే డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు సంధు. 

ఈ పంజాబీ న‌టుడిని టాలీవుడ్‌కు తీసుకొస్తున్నాడ‌ట స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. ఆయ‌న సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆద‌ర్శ కుటుంబం-ఏకే 47 అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ కొన్ని నెల‌ల నుంచి సైలెంటుగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ మూవీలో విల‌న్ పాత్ర‌కు ఇంత‌కుముందు వేరే పేర్లు ప‌రిశీలించారు. చివ‌రికి ఇప్పుడు ఉద‌య్ వీర్ సంధును ఫైన‌లైజ్ చేసిన‌ట్లు స‌మాచారం. 

దురంధ‌ర్-2లో క‌నిపించింది కాసేపే అయినా స్ట‌న్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సంధును చూసి ఎంతో ఇంప్రెస్ అయిన మాట‌ల మాంత్రికుడు.. అత‌ణ్ని టాలీవుడ్‌కు తీసుకొస్తున్నాడ‌ట‌. త్రివిక్ర‌మ్ సినిమాల్లో విల‌న్లు మ‌రీ క‌ర్కశంగా ఏమీ ఉండ‌రు కానీ… వారి పాత్ర‌ల‌కు బాగానే ప్రాధాన్యం ఉంటుంది. ప్ర‌తినాయ‌క పాత్ర‌ల‌ను కూడా ఎంతో ఎంట‌ర్టైనింగ్‌గా తీర్చిదిద్దుతాడు. కాబ‌ట్టి ఉద‌య్ వీర్ సంధు లాంటి పెర్ఫామ‌ర్‌కు మంచి పాత్ర ప‌డితే.. ఇక్క‌డ బిజీ న‌టుడిగా మారే అవ‌కాశ‌ముంది. 

ఉద‌య్ వీర్.. హిందీలో ఇంత‌కుముందు అక్ష‌య్ కుమార్ సినిమా గోల్డ్‌తో పాటు నెట్ ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ అమ‌ర్ సింగ్ చంకీలాలోనూ న‌టించాడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్లో తెర‌కెక్కుతున్న ఆద‌ర్శ‌కుటుంబంలో  కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.