ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా అంగీకరించింది. ఈ మేరకు అమరావతి బిల్లుకు పార్లమెంటు దిగువ సభ లోక్ సభ బుధవారమే ఆమోదం తెలపగా… గురువారం పెద్దల సభ రాజ్యసభ కూడా ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. వెరసి అమరావతిని రాజధానిగా గుర్తించాలని ఏపీ అసెంబ్లీ పంపిన తీర్మానానికి పార్లమెంటు ఓకే చెప్పినట్టు అయ్యింది. ఈ బిల్లును లోక్ సభలో వ్యతిరేకించిన వైసీపీ… రాజ్యసభలోనూ అదే బాటలో సాగింది. అయినా అమరావతి బిల్లుకు ఎలాంటి ఆటంకం ఎదురు కాలేదు.
పార్లమెంటు ఆమోదం లభించిన అమరావతి బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపనుంది. పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లాంచనప్రాయమేనని చెప్పాలి. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ గెజిట్ తో ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి రికార్డుల్లోకి ఎక్కనుంది. ఆపై ఇక ఎవరొచ్చినా రాజధాని అమరావతిని మార్పు చేసే అవకాశం లేదని చెప్పాలి.
అమరావతి బిల్లుపై తనదైన శైలి వైఖరిని ప్రదర్శించిన విపక్ష వైసీపీ… ఓ వైపు తాము అమరావతికి వ్యవతిరేకం కాదంటూనే… పార్లమెంటులోని రెండు సభల్లోనూ బిల్లును ఆ పార్టీ వ్యతిరేకించింది. లోక్ సభలో దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడగా… రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. మిథున్ రెడ్డి చెప్పిన మాటలనే చెప్పిన సుబ్బారెడ్డి అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ అమరావతి బిల్లుకు మద్దతు తెలపడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
