ఆమెకు 35.. అతడికి 25.. సోషల్ మీడియాలో కలిసి సూసైడ్

Suicide
Suicide

సోషల్ మీడియాను ఎవరు ఎలా వాడతారన్నది వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉంటుంది. కొందరు ఉపాధి అవకాశాలకు అనువుగా మార్చుకుంటే.. మరికొందరు ఇన్ ఫ్లుయెన్సర్లుగా మారారు. ఇంకొందరు వ్యక్తిగత జీవితంలోకి కొత్త వారిని ఆహ్వానించే వేదికగా మార్చుకున్నారు. కారణం ఏమైనా.. సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత మన సమాజంలో మార్పులు పెద్ద ఎత్తున చోటు చేసుకోవటమే కాదు.. కుటుంబ వ్యవస్థలకు సైతం కొన్నిసార్లు సవాళ్లు విసురుతున్న పరిస్థితి.

ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే చెందుతుంది.
ముప్ఫైఐదేళ్ల ఆమెకు పెళ్లై.. పిల్లలు ఉన్నారు. అతడికి పాతికేళ్లు. సోషల్ మీడియాలో కలిసిన వారు.. ప్రేమలో పడ్డారు. ఒకరిని విడిచి..మరొకరు ఉండలేని పరిస్థితి. కొత్త బంధంతో వచ్చే ఆనందానికి పాత అనుబంధాన్ని బద్ధలు కొట్టిన ఆమె.. ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే.. అందుకు కారణమైన యువకుడు చివరకు ఆత్మహత్య చేసుకున్న దుస్థితి.

ఈ విషాద ఉదంతంలోకి వెళితే..
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని యర్రమళ్లకు చెందిన పాతికేళ్ల మావుళ్లయ్య చేపల ప్యాకింగ్ పనులకు వెళ్తుంటాడు. అతడికి రెండేళ్ల క్రితం శ్రీకాకుళానికి చెందిన ముప్ఫైఐదేళ్ల రమ సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. స్నేహం కాస్తా.. ప్రేమగా మారింది. అప్పటికే రమకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని వదిలేసి.. తామిద్దరం కలిసి ఉండాలని డిసైడ్ అయ్యారు. దీంతో కుటుంబాన్ని వదిలేసి వచ్చిన రమను.. మావుళ్లయ్య ఈ మధ్యన పెళ్లి చేసుకున్నాడు.

ఆ విషయం రమ తల్లిదండ్రులు.. భర్తకు తెలియటంతో ఆమె ఉన్న చోటుకు వచ్చి.. ఆమెను తీసుకెళ్లిపోయారు. అంతలోనే మరోసారి కుటుంబాన్ని వదిలేసిన రమ.. ఉంగుటూరుకు వచ్చేసింది. జరిగిన పరిణామాల నేపథ్యంలో మావుళ్లయ్య తాజాగా ఏలూరు కాల్వలో దూకేశాడు. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. చివరకు అతడి డెడ్ బాడీని గుర్తించారు.

రెండురోజుల క్రితం రమ కూడా మావుళ్లయ్యతో కలిసి ఉండటాన్ని స్థానికులు చెప్పిన నేపథ్యంలో.. ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడిందా? అన్న సందేహానికి గురయ్యారు చేబ్రోలు పోలీసులు.

దీంతో మంగళగిరి నుంచి ఎస్ డీఆర్ ఎఫ్ టీంను తెప్పించి గాలింపు జరిపారు. ఈ క్రమంలో చేబ్రోలు పోలీస్ స్టేషన్ సమీపంలోని వంతెన వద్ద ఆమె డెడ్ బాడీని గుర్తించారు. కేసునమోదు చేసిన పోలీసులు ఈ ఉదంతాన్ని విచారించారు.

సోషల్ మీడియాలో రెండేళ్ల క్రితం మొదలైన పరిచయం..చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఈ ఉదంతంలో రమ కుటుంబ సభ్యులు.. భర్త.. పిల్లలు పరిస్థితి మాత్రమే కాదు.. పాతికేళ్ల మావుళ్లయ్య మీద ఆధారపడిన అతడి కుటుంబానికి శోకమే మిగిలింది. సోషల్ మీడియా పరిచయాలు.. జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తున్నాయన్న దానికి ఈ విషాద ఉదంతం ఒక ఉదాహరణ.అదే సమయంలో దీంతో ఏ మాత్రం సంబంధం లేని కుటుంబాలు సైతం మూల్యం చెల్లించాల్సిన దుస్థితి.