ఇండియాకు అంత ఈజీ కాదండోయ్

తడబడుతూ అడుగులు వేస్తూనే.. ఎలాగోలా టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌‌కు వచ్చేసింది ఇండియన్ టీం. సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన తీరు చూస్తే.. ఇండియా సెమీస్‌కు వస్తుందన్న నమ్మకం కూడా లేకపోయింది. వెస్టిండీస్‌తో చివరి సూపర్-8 మ్యాచ్‌లో గెలవడమూ సందేహంగానే కనిపించింది.

కానీ సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత జట్టు గట్టెక్కేసింది. సెమీఫైనల్లో సైతం సంజు మరో మేటి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ 254 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా కూడా ఇంగ్లాండ్ అంత తేలిగ్గా ఏమీ లొంగలేదు. ఓటమి భయం కలిగించింది. ఒక దశలో మ్యాచ్ పోయినట్లే అనిపించింది కూడా. కానీ బుమ్రా అద్భుత బౌలింగ్ పుణ్యమా అని భారత్ 7 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గి ఫైనల్ చేరింది.

ఐతే ఇప్పటిదాకా వన్డేల్లో కానీ, టీ20ల్లో కానీ ప్రపంచకప్ గెలవని న్యూజిలాండ్‌తో ఫైనల్, పైగా సొంతగడ్డపై ఆడుతున్నాం కాబట్టి ఈజీగానే కప్పు వచ్చేస్తుందనుకుంటే పొరపాటే.

న్యూజిలాండ్ ప్రతి ప్రపంచకప్‌లోనూ అండర్ డాగ్ లాగే బరిలోకి దిగుతుంది. కానీ ఎక్కువ సందర్భాల్లో అంచనాలను మించే ఆడుతుంది. ముఖ్యంగా ఇండియాతో ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచుల్లో ఆ జట్టుకు చాలా మంచి రికార్డుంది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను ఓడించే కివీస్ ట్రోఫీ సాధించింది. ఇక 2021లో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇండియాను షాకిచ్చి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

అంతకంటే ముందు 2019లో వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్‌కు కివీస్ ఇచ్చిన షాక్‌ను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. చూడ్డానికి మామూలు జట్టులా కనిపిస్తుంది కానీ.. కివీస్ సమష్టి ప్రదర్శనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జట్టు.

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 వరకు కివీస్ మామూలుగానే ఆడింది. కానీ సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్‌గా కనిపించిన దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. 170 లక్ష్యాన్ని 13 ఓవర్లలోపే అలవోకగా ఛేదించిన ఊపుమీద ఆ జట్టు ఉంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌ను ఓడించాలంటే ఇండియా ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే. లేదంటే మాత్రం కప్పు మీద ఆశలు నిలవవు.