క్రికెట్ ప్రపంచంలో కొన్ని సెంటిమెంట్లు వినడానికి వింతగా ఉన్నా, అవి నిజమైనప్పుడు మాత్రం ఆశ్చర్యం వేయక మానదు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే సాధించిన విజయం అలాంటి ఒక క్రేజీ సెంటిమెంట్‌ను మళ్ళీ తెరపైకి తెచ్చింది. వరల్డ్ కప్ టోర్నీలలో ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్టును జింబాబ్వే ఓడించిన ప్రతిసారీ, ఆ కప్పును భారత జట్టే ముద్దాడింది. ఇప్పుడు 2026లో కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో భారత అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
చరిత్రలోకి వెళ్తే.. 1983 వన్డే వరల్డ్ కప్‌లో పసికూనగా ఉన్న జింబాబ్వే 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. అప్పట్లో అది పెద్ద సంచలనం. విశేషం ఏంటంటే, అదే టోర్నీలో కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా మొదటిసారి ప్రపంచ కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కేవలం యాదృచ్చికం అనుకున్న ఈ సంఘటన, మళ్ళీ 24 ఏళ్ల తర్వాత మరోసారి పునరావృతమై అందరినీ ఆశ్చర్యపరిచింది.
2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌లో కూడా జింబాబ్వే మళ్ళీ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ టోర్నీలో ధోనీ నేతృత్వంలోని యువ భారత్ అద్భుతాలు చేస్తూ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అంటే జింబాబ్వే ఆసీస్‌ను ఓడించడం అనేది టీమిండియా విజయానికి ఒక శుభసూచికగా మారిపోయింది. ఇప్పుడు 2026 వరల్డ్ కప్‌లో సికందర్ రజా సేన కంగారూలను మట్టికరిపించడంతో, ఈ హిస్టారికల్ సెంటిమెంట్ మరోసారి నిజమవుతుందా అనే చర్చ మొదలైంది.
కేవలం సెంటిమెంట్లను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు, ప్రస్తుత టీమిండియా ఫామ్ కూడా అలాగే ఉంది. వరుసగా 10 విజయాలతో దూసుకుపోతున్న భారత్, గ్రూప్ దశలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. బౌలింగ్‌లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి మెరుస్తుంటే, బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా వంటి వారు జట్టును నడిపిస్తున్నారు. కొందరు బ్యాటర్లు ఇంకా ట్రాక్ లోకి రావాల్సి ఉంది. ఏదేమైనా సెంటిమెంట్‌కు తోడు ఆటగాళ్ల ప్రతిభ కూడా తోడైతే ఈసారి కప్పు మనదేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జింబాబ్వే గెలుపు భారత క్రికెట్ ప్రేమికులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 1983, 2007 లక్ మళ్ళీ 2026లో కూడా వర్తిస్తుందో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates