సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర రాత్రికి మారిపోవటమే కాదు.. తర్వాతి రోజు ఎంతవరకు వెళుతుంది? ఎక్కడ క్లోజ్ అవుతుందన్నది కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఇలా రోజు రోజుకు పెరుగుతున్న బంగారు ధరలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
ఇలా దూసుకెళుతున్న బంగారం ధరలతో రాబోయే రోజుల్లోతమ పరిస్థితేంటి? అంటూ సామాన్యులు షాక్ కు గురవుతున్నారు. బంగారం కొనగలమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
2025 జనవరిలో రూ.78వేలు ఉన్న బంగారం ధర ఈ ఏడాది జనవరికి రూ.1.78 లక్షలు క్రాస్ చేసింది. అంటే.. ఏడాది వ్యవధిలో రూ.లక్ష ధర అదనంగా పెరిగింది. ఈ పెరుగుదల ఇంకా ఉంటుందని చెబుతున్నారు. ఎంతవరకు వెళుతుందో అంచనా వేయలేకపోతున్నారు.
ఇలా పెరుగుతున్న ధరల్ని చూసిచాలామంది బంగారాన్ని కొనుగోలు చేయటానికి ఎగబడుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విలియం లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మాటకు వస్తే ప్రజలకు వార్నింగ్ లాంటిది చేశారు.
పెరుగుతున్న బంగారు ధరల్ని ఆయన ఒక నీటి బుడగతో పోలుస్తూ.. ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ‘‘ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. బంగారం ధర ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుంది. ధరలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో బంగారం దొరకదేమోనని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సంస్థలు ఇచ్చే నివేదికలు సైతం ప్రజల్ని భయపెడుతున్నాయి. ఇదంతా ఒక ట్రాప్’’ అంటూ విలియం లీ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన గతానికి సంబంధించి ఉదాహరణలు చెప్పుకొచ్చారు. ‘‘1980లో బంగారం ధరలు ఊహకు అందని రీతిలో పెరిగాయి. ఆ సమయంలోనూ చాలామంది ప్రజలు బంగారాన్ని కొనడానికి ఎగబడ్డారు. కొన్ని రోజుల తర్వాత బంగారం ధర 57 శాతం పడిపోయింది. 2011లో కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. బంగారం ధర పెరుగుతుంది కాబట్టి అదే పనిగా కొనేయకండి.. కొన్ని రోజులు వెయిట్ చేయండన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
అంతేకాదు.. బంగారం ధరలు పెరగటాన్ని ఒక ట్రాప్ గా అభివర్ణించిన ఆయన కొన్ని పెద్ద సంస్థలు.. ఇన్వెస్టరలు తమ వద్ద ఉన్న బంగారాన్ని ఎక్కువ ధరకు అమ్ముకోవటానికి ఇలా చేస్తారన్న ఆయన.. ‘‘ఎప్పుడైతే ఒక వస్తువుకు డిమాండ్ పెరుగుతుందో.. దాని ధర కచ్ఛితంగా పెరుగుతుంది. కానీ బంగారం విషయంలో మాత్రం లండన్, న్యూయార్క్ ల్లోని కొన్ని పెద్ద బ్యాంకులు ఫిక్స్ చేస్తాయి’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్న పరిస్థితి.
ఇక్కడే మరో ముఖ్యమైన గమనిక – మేం బంగారం కొనమని కానీ కొనొద్దని కానీ చెప్పట్లేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఒక ప్రముఖుడు చేసిన వ్యాఖ్యల్ని మాత్రమే చెబుతున్నాం. దీన్నో సమాచారంగా తీసుకోండి. మీ విచక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates