కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన

అమ్మాయిది అగ్రకులం… అబ్బాయిది వెనుకుబడిన కులం…ఇద్దరూ ప్రేమించుకున్నారు…కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు…ఆ తర్వాత ఆ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది…అది చూసి ఓర్వలేని అమ్మాయి తరఫు వాళ్లు ఆ ఇద్దరినీ పరువు హత్య చేశారు..ఇటువంటి రియల్, రీల్ స్టోరీలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ, తన ప్రేమను అంగీకరించలేదని కన్న తల్లిదండ్రులనే కర్కశంగా కడతేర్చిన కసాయి కూతురి స్టోరీ ఇప్పుడు తెలంగాణలో సంచలనం రేపింది.

వికారాబాద్ లోని యాచారం గ్రామానికి చెందిన నక్కోలి లక్ష్మి, దశరథ్ దంపతుల చిన్న కూతురు సురేఖకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ చదివి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది సురేఖ. ఇన్ స్టాలో ఏడాది క్రితం పరిచయమైన ఓ యువకుడితో ప్రేమలో పడ్డ సురేఖ ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ కుర్రాడినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది.

అయితే, ఆ యువకుడి కులం వేరు కావడంతో సురేఖ తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో, తన ప్రేమకు అడ్డుగా నిలిచిన తల్లిదండ్రులను కడతేర్చాలని నిర్ణయించుకుంది.

తాను పనిచేసే ఆసుపత్రిలో ఎనస్థీషియా కోసం వాడే అట్రాకూరియం (అర్టాసిల్) 2.5 ఎంఎల్ సీసాలు నాలుగు దొంగిలించింది సురేఖ. ఈ నెల 24 రాత్రి తల్లిదండ్రులతో భోజనం చేస్తూ ఆ యువకుడితో పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఆ పెళ్లికి మరోసారి తల్లిదండ్రులు నో చెప్పడంతో వారిని చంపాలని పక్కాగా ఫిక్సయింది.

కీళ్లు, ఒళ్లు నొప్పులు తగ్గే ఇంజెక్షన్ అంటూ ఇద్దరికీ 5 ఎంఎల్ డోస్ ను ఇచ్చింది సురేఖ. ఎనస్థీషియాకు వాడే ఆట్రాకూరియం మోతాదుకు మించి ఇవ్వడంతో కొద్దిసేపటికే దశరథ్, లక్ష్మి చనిపోయారు.

ఇది సహజ మరణం అని చెబుతూ తన అన్నకు సురేఖ ఫోన్ చేసింది. అయితే, అతడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో అసలు నిజం ఒప్పుకుంది సురేఖ. ఈ విషయం తెలుసుకున్న సురేఖ ఇద్దరు అక్కలు, అన్న, పోలీసులు అవాక్కయ్యారు. ప్రస్తుతం సురేఖ కటకటాలు లెక్కబెడుతోంది.