కారుణ్య మరణం…వైద్యం చేసినా బ్రతికే అవకాశం లేక చావు కోసం ఎదురు చూసే పేషెంట్ల కోసం వారి కుటుంబ సభ్యులు కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టు అనుమతి కోరుతుంటారు. దీర్ఘకాలంగా కోమాలో ఉన్న పేషెంట్లు, చికిత్సకు స్పందించకుండా ఇక లాభం లేదని డాక్టర్లు తేల్చేసిన పేషెంట్లకు మెర్సీ కిల్లింగ్ తప్ప వేరే మార్గం లేదని చాలామంది కుటుంబ సభ్యులు భావిస్తుంటారు.
జీవచ్ఛవాల్లా పడి ఉన్న తమవారి బాధ చూడలేక వారికి మరణం ప్రసాదించాలని కోర్టును కోరుతుంటారు. అయితే, ఒక మనిషి బతకాలో, చావాలో నిర్ణయించడానికి తామెవరమని కోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఢిల్లీకి చెందిన హరీష్ రాణా 2013లో ఓ భవనం నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడ్డాడు. దీంతో, హరీష్ తలకు బలమైన గాయమైంది. అప్పటి నుంచి అతడు కోమాలోనే ఉన్నాడు. హరీష్ తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులు తిరిగి, మరెన్నో చికిత్సలు చేయించినా ఫలితం మాత్రం శూన్యం.
11 ఏళ్లుగా చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఆర్థికంగా, మానసికంగా ఆ కుటుంబం దెబ్బతింది. ఈ క్రమంలోనే తమ కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలని 2024లో ఢిల్లీ హైకోర్టును హరీష్ తల్లిదండ్రులు ఆశ్రయించారు.
వారి అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. అయితే, తాజాగా వైద్యులు హరీష్ ను మరోసారి పరీక్షించి అతడు కోలుకునే అవకాశం లేదని మెడికల్ రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా హరీష్ తల్లిదండ్రులు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా..విచారణకు వారి పిటిషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించింది.
వారి అభిప్రాయాలను తెలుసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా సున్నితమైన అంశమని అభిప్రాయపడింది. ఎవరు బతకాలో, ఎవరు చావాలో నిర్ణయించడానికి తామెవరం అని భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. అయితే, హరీష్ కు లైఫ్ సపోర్ట్ ట్రీట్మెంట్ ఉపసంహరించే విషయాన్ని పరిశీలిస్తామని తీర్పును రిజర్వ్ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates