తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఫస్ట్ టైమ్ ఓ హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి స్థానిక కోర్టు ఉరి శిక్ష విధించింది. కాగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. అనేక నేరాలు జరిగాయి. అనేక హత్యలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక, మహిళలపై అత్యాచారం కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. కొన్ని కేసుల్లో నిందితులు ఎన్ కౌంటర్ అయ్యారు. కానీ.. ఇప్పటి వరకు బలమైన ఇలాంటి నేరాల కేసుల్లో ఉరి లేదా మరణ శిక్ష ఇప్పటి వరకు ఎవరికీ పడలేదు. తొలిసారి ఓ మహిళ హత్య కేసులో కోర్టు దోషికి మరణ శిక్ష విధించడం గమనార్హం.
ఏం జరిగింది?
2011, జూలై 18వ తేదీన సనత్‌నగర్‌లో ఓ మహిళ దారుణహత్యకు గురయ్యారు. ఇనుప సామాన్లు తయారు చేసే వ్యక్తి.. ఆమెపై బలాత్కారం చేయడంతో .. ఆమె ప్రతిఘటించారు. ఈ క్రమంలో చేతిలోని సుత్తితో ఆమె తలను ఛిద్రం చేసిన నిందితుడు మహిళను చంపేశాడు. ఈ ఘటన అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించింది.
దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కేవలం రోజుల వ్యవధిలోనే నిందితుడు(ఇప్పుడు దోషి)ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. తాజాగా నేరం నిరూపితం కావడంతో మేడ్చల్ – మల్కాజ్‌గిరి మూడో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారించి.. ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఇలా.. ఒక దోషికి మరణ శిక్ష విధించడం తెలంగాణలో ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం.
ఎవరతను?
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన కరణ్ సింగ్.. ఉపాధి నిమిత్తం రెండు దశాబ్దాల కిందటే హైదరాబాద్‌కు వచ్చాడు. ఇనుప సామాన్లు తయారు చేసి.. వీధుల్లో విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలోనే 2011లో ఓ ఇంటికి వెళ్లిన సింగ్.. ఆ ఇంటి మహిళపై కన్నేసి.. బలత్కారం చేయబోయాడు.
ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడ్డాడు. ఇక, తాజాగా కోర్టు మరణ శిక్ష విధించినా.. అది ఆమోదం పొంది.. అమలవుతుందా? అనేది సందేహం. ఎందుకంటే.. స్థానిక కోర్టులు విధించే తీవ్ర శిక్షలను హైకోర్టు సమీక్షించి.. తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇది జరగడానికి సుదీర్ఘకాలం సమయం పడుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates