మరో నాలుగు రోజుల్లో క్యాలెండర్ మారుతోంది. 2025కు గుడ్‌బై చెబుతూ.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నాం. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంలో ఏం జరిగిందనేది మననం చేసుకోవడం.. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగడం అనేది.. ఎవరికైనా అలవడాల్సిన అంశం.
ఈ నేపథ్యంలో 2025లో ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ దేశానికి చేసింది..సాధించింది.. ఏంటి అనేది ఆసక్తికర విషయం. ప్రధానంగా ఈ ఏడాది 5 విషయాల్లో నరేంద్ర మోడీ తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీయంగానే కాకుండా.. ప్రజలకు చేరువ కావడంలోనూ.. ప్రపంచ దేశాల్లో తన ఇమేజ్‌ను పెంచుకోవ డంలోనూ సక్సెస్ అయ్యారు.
1) ఈ ఏడాది తొలినాళ్లలోనే ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లారు. మొత్తంగా ఈ ఏడాది 6 దేశాల్లో పర్యటించారు. ఏదేశమేగినా అన్నట్టుగా.. భారత దేశ విదేశాంగ విధానాన్ని ఆయన అవలంభించారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. విధించిన భారీ సుంకాలు దేశాన్ని కలవరపెట్టినా.. మోడీ మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే జీఎస్టీని సవరించి.. శ్లాబులు తగ్గించడం ద్వారా విదేశీ సుంకాల ప్రభావంపడకుండా.. స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ పెంచారు.
2) రాజకీయంగా ఈ ఏడాది జరిగిన అతి పెద్ద ఎన్నిక బీహార్. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన రెండు దశల పోలింగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ సహా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి అత్యంత కీలకంగా మారింది. దీనిని గ్రహించిన ప్రధాన మంత్రి.. అనేక విషయాల్లో అప్పటి వరకు ఉన్న బారికేడ్లను ఎత్తివేశారు. మహిళలకు రూ.10 వేల చొప్పున చేసే ఆర్థిక సాయానికి బీజేపీ తరఫున ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అలాగే.. ఎన్నికల పోలింగ్ తర్వాత.. గెలిచిన తర్వాత.. సీఎం అభ్యర్థిని నిర్ణయించే సంప్రదాయానికి కూడా చెక్ పెట్టి.. నితీష్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఇక, ఎన్నికల సమయంలోనూ దూకుడుగా ప్రసంగించారు. ప్రధాన ప్రత్యర్థి ఆర్జేడీని తుపాకులు, విధ్వంసక పార్టీగా ప్రచారం చేయడంలో ఆయన ముందున్నారు. దీంతో బీహార్‌లో మరోసారి మాత్రమేకాదు.. ఈ దఫా ఘన విజయమే దక్కింది.
3) హిందూత్వకు ఎప్పుడూ పెద్దపీట వేసే ప్రధాన మంత్రి.. ఈ ఏడాది కూడా అదేపనిచేశారు. అయోధ్య రామమందిరంలో భారీ ధ్వజాన్ని ఆవిష్కరించడం ద్వారా.. ఈ ఆలయానికి మరింత ప్రాశస్త్యం పెంచారు. భారత పర్యటనకు వచ్చిన.. పుతిన్‌కు రష్యా భాషలో అనువదించిన భగవద్గీతను కానుకగా ఇవ్వడం ద్వారా.. భారత రాజ్యం స్థితి గతిని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక, ఉడిపి శ్రీకృష్ణ మందిరాన్ని, ఏపీలోని శ్రీశైలాన్ని, ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాధుని పలు మార్లు దర్శించుకున్నారు.
4) పాత చట్టాల మార్పు: ఇప్పటి వరకు ఉన్న అనేక చట్టాల్లో మార్పులు తీసుకువచ్చారు. ప్రధానంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని సమూలంగా మార్చేశారు. దీని పేరును వీబీజీ-రామ్‌జీగా మార్చడంతోపాటు.. యూపీఏ ప్రభుత్వం పెట్టిన నిబంధనలను కూడా ఎత్తేశారు. అంతేకాదు.. రాష్ట్రాలవాటాను మరింత పెంచారు. ఇది సక్సెస్ అవుతుందా.. కాదా.. అనేది చూడాలి.
5) కూటమితో సఖ్యత. ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా బీజేపీ పలు పార్టీలతో సఖ్యత పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ సహా కొన్ని రాష్ట్రాల కూటములు … పట్టు సడలకుండా.. ప్రధాని మోడీ స్వయంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా బీహార్-ఏపీ విషయంలో ప్రధాని మోడీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నది వాస్తవం.
ఇక, ఈ ఏడాది పలు విషాదాలు చోటు చేసుకున్నాయి. పెహల్గాం దాడి, హ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగి.. వందల సంఖ్యలో మృతి చెందారు. ఇక, ఇండిగో విమాన సంక్షోభం దేశాన్నికుదిపివేసింది. అయినా.. ప్రధాని తన పనితీరుతోనే వాటికి సమాధానం చెప్పారు. మొత్తంగా.. మైనస్‌లను సైతం ప్లస్‌లుగా మలుచుకుని ఈ ఏడాది మోడీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగారనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates