థాయ్‌లాండ్ లో విష్ణు విగ్రహం ధ్వంసం చేసిందెవరు?

థాయ్‌లాండ్ కంబోడియా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న ఒక విష్ణు విగ్రహాన్ని థాయ్ మిలిటరీ జేసీబీలతో కూల్చివేసిన వీడియోలు బయటకొచ్చాయి. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పందించింది. ఇది మతపరమైన దాడి కాదని, కేవలం భద్రతా చర్యల్లో భాగంగానే చేశామని క్లారిటీ ఇచ్చింది.

ఆ విగ్రహం 2014లో కట్టారని, దానికి అధికారికంగా ఎలాంటి మతపరమైన గుర్తింపు లేదని థాయ్ అధికారులు చెబుతున్నారు. ఆ భూమి తమదే అని చెప్పుకోవడానికి కంబోడియా సైనికులు ఆ విగ్రహాన్ని అక్కడ ఒక ‘ల్యాండ్ మార్క్’ లాగా పెట్టారని థాయ్‌లాండ్ వాదన. ఆ ప్రాంతాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాక, సరిహద్దు భద్రత కోసమే దాన్ని తొలగించామన్నారు.

హిందూమతంతో సహా అన్ని మతాలను తాము సమానంగా గౌరవిస్తామని థాయ్‌లాండ్ స్పష్టం చేసింది. అయితే ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని భారత్ ఆవేదన వ్యక్తం చేసింది. రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచించింది.

మరోవైపు కంబోడియా మాత్రం ఇది తమ భూభాగంలో జరిగిన దాడి అని ఆరోపిస్తోంది. సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో ఉన్న తమ ప్రదేశంలోకి వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేశారని మండిపడుతోంది. సరిహద్దు గొడవల వల్ల ఇప్పటికే అక్కడ పరిస్థితులు సీరియస్ గా ఉన్నాయి, ఈ తాజా ఘటనతో వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.