H-1B టెక్కీలకు కంపెనీ వార్నింగ్.. ఇండియా వెళ్తే..

Shot of a young businessman experiencing stress during a late night at work

అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్కీలకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఇప్పటికే గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను హెచ్చరించగా, తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా తన H-1B ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు వెళ్తే అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే వేలమంది ఇండియా వచ్చి తిరిగి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.

దీనంతటికీ కారణం అమెరికా కొత్తగా తెచ్చిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీనే. దీనివల్ల వీసా స్టాంపింగ్ అపాయింట్‌మెంట్లు ఏకంగా 12 నెలల వరకు ఆలస్యం అవుతున్నాయి. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్ కాన్సులేట్లలో ఇంటర్వ్యూలు 2026 జూన్ వరకు వాయిదా పడుతున్నాయని సమాచారం. దీంతో రెన్యూవల్ కోసం వచ్చిన వారు తిరిగి అమెరికా వెళ్ళలేక ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు పంపిన మెమోలో కొన్ని కీలక సూచనలు చేసింది. ఒకవేళ మీరు ఇప్పటికే ఇండియాలో ఉండి, మీ అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయితే, మీకు ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్ దొరకడం చాలా కష్టం అని తేల్చి చెప్పింది. అంటే కొత్త తేదీ వచ్చేదాకా నెలల తరబడి ఇండియాలోనే నిరీక్షించక తప్పదు. ఇది ఉద్యోగుల కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే చేతిలో ఇంకా వాలిడ్ వీసా ఉన్నవారికి మాత్రం ఒక సలహా ఇచ్చింది. మీ వీసా గడువు ముగియకముందే వెంటనే అమెరికా వచ్చేయమని సూచించింది.

కొత్త స్టాంపింగ్ కోసం ఆశపడి అక్కడే ఉంటే, ఉన్న వీసా కూడా ఎక్స్‌పైర్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే రిస్క్ తీసుకోకుండా వెంటనే వెనక్కి వచ్చేయడం ఉత్తమం అని కంపెనీ అభిప్రాయపడింది. ఇక అమెరికాలోనే ఉండి ఇండియా వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని గట్టిగా చెప్పింది. ఒకవేళ వెళ్తే, కొత్త వీసా వచ్చేదాకా అక్కడే ఉండాల్సి వస్తుందని, అన్ని రోజులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇవ్వడం కుదరకపోవచ్చని హెచ్చరించింది. పరిస్థితి చక్కబడే వరకు ప్రయాణాలు మానుకోవడమే సేఫ్ అని టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను అలర్ట్ చేస్తున్నాయి.