టీమ్ లో గిల్ లేకపోవడం మంచిదే

నిన్నటి నుంచి అందరూ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. వైస్ కెప్టెన్ రేంజ్ లో ఉన్న శుభ్‌మన్ గిల్ లేకపోవడం పెద్ద షాక్ అని ఫీలవుతున్నారు. కానీ సెలెక్టర్లు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వెనుక చాలా పెద్ద లాజిక్ ఉంది. కేవలం ఫామ్ ఒక్కటే కాదు, దీని వెనుక జరిగిన ఒక ‘రిపుల్ ఎఫెక్ట్’ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఆ 15 మందిని ఎలా ఫైనల్ చేశారు అనే వివరాల్లోకి వెళితే..

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత గిల్, జైస్వాల్ ఫ్యూచర్ ఓపెనర్లు అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ టెస్ట్ మ్యాచ్‌ షెడ్యూల్స్, డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ వల్ల వీళ్లు టెస్టులకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే గ్యాప్‌లో యంగ్ గన్స్ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. దొరికిన ఛాన్స్‌ని వదలకుండా సెంచరీలతో మోత మోగించి సెలెక్టర్లని తమ వైపు తిప్పుకున్నారు.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏసియా కప్ నుంచి సౌతాఫ్రికా సిరీస్ దాకా గిల్ ఆడిన 15 మ్యాచ్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. దీంతో ఫామ్ లేని గిల్ ప్లేస్ డేంజర్‌లో పడింది. అదే టైమ్‌లో సంజూ ఓపెనర్‌గా ప్రూవ్ చేసుకోవడంతో, గిల్‌ని పక్కన పెట్టి సంజూని మెయిన్ ఓపెనర్‌గా ప్రమోట్ చేశారు. ఈ ఒక్క మూవ్ టీమ్ మొత్తం స్ట్రక్చర్‌ని ఒక్కసారిగా మార్చేసింది.

గిల్ ప్లేస్‌లో సంజూ ఓపెనింగ్‌కి వెళ్లడంతో, మిడిల్ ఆర్డర్‌లో ఖాళీ ఏర్పడింది. అక్కడ జితేష్ శర్మని ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో 2023 నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న ఫినిషర్ రింకూ సింగ్ మళ్ళీ స్క్వాడ్‌లోకి వచ్చేశాడు. ఇక బ్యాకప్ ఓపెనర్ ప్లస్ కీపర్ కోటాలో దేశవాళీలో ఇరగదీసిన ఇషాన్ కిషన్‌కి లక్కీ ఛాన్స్ దక్కింది.

సో, గిల్ పక్కకు వెళ్లడం వల్ల టీమ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిందనే చెప్పాలి. సూర్య కెప్టెన్సీలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అభిషేక్, సంజూ ఓపెనింగ్, ఆ తర్వాత సూర్య, తిలక్, దూబే, హార్దిక్ మిడిల్ ఆర్డర్ బాధ్యతలు తీసుకుంటారు. ఇక ఫినిషింగ్ కి అక్షర్, రింకూ ఉండనే ఉన్నారు. బౌలింగ్‌లో బుమ్రా, కుల్దీప్, అర్ష్‌దీప్ కీలకం కానున్నారు.

ఇక షెడ్యూల్ విషయానికొస్తే, గ్రూప్ స్టేజ్‌లో ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచే హైలైట్. ఆ తర్వాత సూపర్ 8లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా లాంటి పెద్ద జట్లతో తలపడాలి. అహ్మదాబాద్, చెన్నై, కోల్ కతా పిచ్‌లపై మనోళ్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఈసారి కప్పు కొట్టాలని ఫ్యాన్స్ వెయిటింగ్. మరి సూర్య సేన ఏం చేస్తుందో చూడాలి.